
భారతదేశ రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. సోమవారం రాత్రి ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో స్టీల్ సిఐటియు ఆధ్వర్యాన 'సేవ్ ప్లబిక్‌సెక్టర్-సేవ్ ఇండియా' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన్‌సేన్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్రోద్యమం ద్వారా బ్రిటీష్ పాలకులను వెళ్లగొట్టగలిగినా, వారి విధానాలను మాత్రం మన పాలకులు అనుసరిస్తున్నారన్నారు. మోడీ ప్రభుత్వం ఈ విధానాలను మరింత వేగంగా అమలుచేస్తోందన్నారు. కార్మిక చట్టాల మార్పు, పిఎఫ్ నిధులను షేర్ మార్కెట్‌కు తరలింపు, బీమా, రైలు, రక్షణ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, ప్రజా భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో లాక్కోవడం తదితర అంశాలను ఈ సంవత్సరకాలంలో వారు పెద్దఎత్తున చేపట్టారని విమర్శించారు. వీటి వల్ల కలుగుతున్న నష్టాలను ప్రతి ఒక్కరికీ వివరించి చైతన్యపరచడం ద్వారానే భారత రక్షణ సాధ్యమన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2వ తేదీన సమ్మె చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కార్మికవర్గానికి ఆయన పిలుపు నిచ్చారు.