
రాజధాని ప్రాంత, అమరావతి నగర అభివృద్ధి పనుల ప్రణాళిక, నియంత్రణ అధికారాన్ని ప్రభుత్వం ఎపిసిఆర్డిఎకు అప్పగించింది. అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మారిన రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ సంస్థ (సిసిడిఎంసి)కు 217 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన రాజధాని నగర మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను అప్పగించింది. ఈ మేరకు సిఆర్డిఎ ముఖ్య కార్యదర్శి అజరుజైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిసిడిఎంసి పేరును అమరావతి అభివృద్ధి కంపెనీ (ఎడిసి)గా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం సూచించింది. రాజధాని అభివృద్ధిలో సిఆర్డిఎ, ఎడిసి సమన్వయంతో పని చేయాలని, అందులో భాగంగానే పని విభజన చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రాజధాని ప్రాంతంతోపాటు క్యాపిటల్ సిటీ బయట కూడా సిఆర్డిఎ డెవలప్మెంట్ ఏజెన్సీగా ఉండనుంది. ఎడిసిగా మారనున్న సిసిడిఎంసి రాజధాని నగరంలో మౌలిక సదుపాయల కల్పన కోసం పని చేయాల్సి ఉంది.