
లెనిన్ రాసిన ప్రసిద్ధ గ్రంథాల్లో ఒకటి 'రాజ్యము-విప్లవము'. దీన్నాయన 1917 ఫిబ్రవరిలో జరిగిన బూర్జువా విప్లవానంతరం అజ్ఞాతంలో వుంటూ, 1917 ఆగస్టు, సెప్టెం బర్ నెలల్లో రాశాడు. ఆ సమయంలో ఆయన రాజధాని పెట్రోగ్రాడ్‌కి అనతి దూరంలో గల రజ్లీవ్ సరస్సు ఒడ్డునున్న చిట్టడివిలో కొన్ని రోజులూ, ఫిన్లాండ్ రాజధాని 'హెల్సింగ్ ఫర్స్' పట్టణం సమీపంలో కొన్ని రోజులూ, అటు తర్వాత 'హెల్సింగ్ఫర్స్'లో కొన్ని రోజులూ, ఆపై పెట్రోగ్రాడ్లోగల పార్టీ సెంట్రల్ కమిటీతో సంప్రదింపులు జరిపేందుకు అనువుగా వుండటం కోసం సరిహద్దు పట్టణమైన 'వీబోర్గ్'లో మిగిలిన రోజులూ వున్నాడు.మొదట ఆయన ఈ గ్రంథానికి ఏడు ప్రకరణాల పథకం వేసుకున్నాడుగానీ, ఆరు ప్రకరణాలు రాశాక, విప్లవంలో స్వయంగా పాల్గొనడం, దానికి నేతృత్వం వహించడంలో నిమగమై, ఏడో ప్రకరణానికి '1905, 1917 రష్యన్ విప్లవాల అనుభవం' అనే పేరు పెట్టి కూడా ఆపేశాడు. ఈ గ్రంథ ప్రచురణ విప్లవానంతరం, 1918లో జరిగింది.
గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభుత్వ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థగా రూపాంతరం చెందే ప్రక్రియను సామ్రాజ్యవాద యుద్ధం త్వరిత పరిచిందనీ, ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగు తూ, ప్రజల స్థితిని దుర్భరం చేసిందనీ, సర్వశక్తివంతమైన పెట్టుబడిదారీ సంఘాలతో అంతకంతకూ మిళితమౌతున్న రాజ్యం శ్రామిక ప్రజలమీద చేసే పైశాచిక పీడనను తీవ్రం చేస్తోందనీ, అందువల్ల ప్రపంచ కార్మికవర్గం ఐక్యమౌతోందనీ, అందుచేత కార్మికవర్గ విప్లవానికి రాజ్యంతో గల సంబంధం ఎలాంటి దనే సమస్య ఆచరణాత్మక ప్రాముఖ్యం సంతరిం చుకున్నదనీ పీఠికలో లెనిన్ పేర్కొన్నాడు. శాంతియుతంగా అభివృద్ధి జరిగినకాలంలో అవకాశవాదం, జాతీయ దురహంకారం పెరిగి, అధికారిక సోషలిస్టు పార్టీలపై పెత్తనం చేస్తున్నాయని, ఫలితంగా ఆపార్టీలు మాటల్లో సోషలిజం, చేతల్లో జాతీయ దురహంకారమూ ప్రదర్శిస్తున్నాయని చెబుతాడు. ఈ సోషలిస్టు నాయకులు తమ జాతీయ బూర్జువా వర్గ ప్రభుత్వాలను బలపరుస్తూ యుద్ధానికి మద్దత్తు తెలుపుతున్నారని చెబుతాడు. సామ్రాజ్యవాద యుద్ధం చిన్న, దుర్భర జాతుల్ని దోచుకుంటూ ఇలాంటి దోపిడీ సొత్తును పంచుకోవడానికీ, తిరిగి పంచుకోవడానికీ జరిగే యుద్ధమే కాబట్టి, శ్రామిక ప్రజల్ని బూర్జువా వర్గ ప్రభావం నుండి విముక్తం చేయటానికి పోరాడాలనీ, 'రాజ్యం' గురించి ఉన్న అవకాశవాద దురభిప్రాయాల మీద పోరాడకుండా ఆ పోరాటం విజయ వంతం కాదనీ ఆయన చెబుతాడు. అందులో భాగంగా మొదట మార్క్స్, ఏంగెల్స్‌ల రాజ్య సిద్ధాంతాన్ని పరీక్షించి, ఈ సిద్ధాంతంలో ఏయే అంశాలను అవకాశవాదులు ఉపేక్షిస్తున్నారో లేదా వికృతం చేస్తున్నారో పరిశీలించి, చివరగా 1905, 1917 నాటి రష్యన్ విప్లవాను భవాల్ని క్రోడీకరిద్దామని అంటాడు లెనిన్.
చరిత్రలో పీడిత వర్గాలకోసం పోరాడే విప్లవకారుల్నీ, వారి ఆలోచనల్నీ తీవ్రంగా అణచివేసిన పీడక వర్గాలు, ఆ విప్లవకారులు చనిపోయాక మాత్రం పీడితుల్ని మోసగించ టానికి ఆ విప్లవకారుల్ని ప్రమాద రహిత దేవతా విగ్రహాలుగా మార్చడానికి, వారి పేర్లకు కొంత గొప్పతనం ఆపాదించడానికి ప్రయత్ని స్తూ, వారి సిద్ధాంతాల్లో బూర్జువా వర్గానికి అంగీకారయోగ్యమయ్యేవాటిని ముందుకు తీసుకువస్తారని గ్రంథారంభంలో లెనిన్ చెబుతాడు. ప్రస్తుతం మార్క్సిజానికి అలాంటి గతి పట్టించేందుకు సోషల్ జాతీయ దురహం కారులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం గురించి మార్క్స్ నిజంగా బోధించినదాన్ని పునఃస్థాపించడం మన కర్తవ్యంగనుక, అందుకోసం మార్క్స్, ఏంగెల్స్లనుంచి పలు దీర్ఘ ఉల్లేఖనలు అవసర మౌతాయనీ చెబుతాడు.
మొదట ఏంగెల్స్ ''కుటుంబమూ, సొంత ఆస్తి, రాజ్యమూ పుట్టుక'' అనే గ్రంథంలో రాజ్యానికిచ్చిన సుప్రసిద్ధ నిర్వచనాన్ని విశ్లేషిం చాడు. రాజ్యం అనేది రాజీపడలేని వర్గ వైరుధ్యాల ఫలితమూ, వ్యక్తీకరణా అనీ, వర్గ వైరుధ్యాలు ఎప్పుడు, ఎక్కడ, ఏ మేరకు రాజీపడ లేవో అప్పుడు, అక్కడ రాజ్యం ఉద్భవిస్తుందన్న ఏంగెల్స్ అభిప్రాయాన్ని లెనిన్ వివరించాడు. మార్క్స్ ప్రకారం, రాజ్యం-ఒక వర్గం మరొక వర్గాన్ని పీడించడానికి ఉన్న ఒక అంగం. వర్గాలమధ్య ఘర్షణను అదుపులో ఉంచటం ద్వారా ఈ పీడనను చట్టబద్ధం చేసి, స్థిరపరిచే 'సువ్యవస్థ'ను ఇది స్థాపిస్తుంది. మార్క్సిజం యొక్క వికృతీకరణ ఈ ముఖ్యమైన అంశం మీదనే ప్రారంభమౌతుందని లెనిన్ అన్నాడు. వర్గ వైరుధ్యాలూ, వర్గ పోరాటాలూ ఉన్నచోటనే రాజ్యం వుంటుందని చారిత్రక వాస్తవాల వల్ల ఒప్పుకోవలసి వచ్చిన బూర్జువా, పెటీ బూర్జువా సిద్ధాంతవేత్తలు, రాజ్యం వర్గాల రాజీకి ఏర్పడ్డ అంగంగా కనిపించేట్టు మార్క్స్‌ని దిద్దుతారని లెనిన్ వివరించాడు.
రాజ్యం యొక్క రెండో విశిష్ట లక్షణం ఒక సామాజికాధికారం స్థాపించబడటం. దీనిలో భాగంగా సాయుధ భటులు మాత్రమేగాక, జైళ్ళూ, రకరకాల నిర్బంధ సంస్థలూ వుంటాయని ఏంగెల్స్ చెప్పాడు. అలాగే ప్రతి రాజ్యానికీ ఒక గుణంగా వున్న ఈ సామాజికాధికారం, ప్రజా నీకం అంతా సాయుధులుగా వ్యవహరించే వ్యవస్థతో ఏకీభవించదంటాడు ఏంగెల్స్. ఆయన ఇదంతా చెప్పింది యూరోపియన్లకు. వారిలో మెజారిటీకి ఇది అర్థం కాలేదు. మరయితే రాజ్యానికి సాయుధ భటుల ప్రత్యేక దళాలు (పోలీసులు, సైన్యమూ) కలిగి వుండటం ఎందుకని అడిగితే, ఏవేవో అరువు తెచ్చుకున్న మాటలు తప్ప, సమాజం రాజీపడజాలని విరుద్ధ వర్గాలుగా చీలిపోయిందనీ, అందువల్లే ఈ అవసరం ఏర్పడిందనీ చెప్పరు. ప్రతి గొప్ప విప్లవమూ సామూహిక కార్యాచరణ స్థాయిలో మన ఎదుట లేవనెత్తే సమస్య-సాయుధ భటుల ప్రత్యేక దళాలకూ, సాయుధ ప్రజానీకపు కార్యాచరణకు మధ్యగల సంబంధమనీ, దీన్ని ఏంగెల్స్ లేవనెత్తాడనీ చెబుతూ, ఈ సమస్యను యూరోపియన్, రష్యన్ విప్లవాల అనుభవం ఆధారంగా నిర్దిష్టంగా ఎలా సిద్ధాంతీకరించ వచ్చునో చూద్దామని లెనిన్ చెప్పాడు. ఏంగెల్స్ ఈ విషయాన్ని చెప్పిన 1891లోనే పరదేశాల్ని జయించడంలో యూరప్ దేశాల మధ్య గల పోటీ సామ్రాజ్యవాదం వైపు మలుపు తిరుగు తోందని గుర్తించాడనీ, ఈ పోటీ గొప్ప రాజ్యాల విదేశాంగ విధానంలోని ముఖ్యాంశాల్లో ఒకటిగా చెప్పాడనీ, రష్యాలో అయితే సోషల్ జాతీయ, దురహంకార బద్మాషులు, ఈ పోటీ సామ్రాజ్యవాద యుద్ధాన్ని తీవ్రం చేసినప్ప ట్నుంచీ, తమ సొంత బూర్జువా వర్గపు పరభక్ష ణాత్మక ప్రయోజనాల్ని సమర్ధిస్తూ, ఆ సమర్థనకు 'పితృదేశ రక్షణ, రిపబ్లిక్ విప్లవాల రక్షణ' అనే ముసుగు వేస్తున్నారని లెనిన్ వివరించాడు.
ప్రజాతంత్ర వ్యవస్థలో ఉద్యోగులకు సూట ిగా లంచం ఇవ్వడం ద్వారా, ప్రభుత్వానికీ, స్టాక్ ఎక్స్చేంజ్కీ మధ్య పొత్తుద్వారా పెట్టుబడి తన అధికారాన్ని పరోక్షంగా నిర్వహిస్తుందన్న ఏంగెల్స్‌ని ఉదహరించి, ఆ రెండు పద్ధతుల్ని సామ్రాజ్యవాదము, బ్యాంకుల పెత్తనమూ అపురూపమైనకళగా అభివృద్ధి చేశాయని లెనిన్ అంటాడు. ప్రజాతంత్ర రిపబ్లిక్లో పెట్టుబడి యొక్క సామర్థ్యం - రాజకీయ యంత్రాంగం యొక్క లోపాలమీద గానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దోషభూయిష్టమైన రాజకీయ పైపెంకు మీద గానీ ఆధారపడదనీ, ఎందుకంటే, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రజాతంత్ర రిపబ్లిక్ ఉత్తమమైన రాజకీయ రక్షణ కవచం కాబట్టి, ఒకసారి పెట్టుబడి ఆరక్షణ కవచాన్ని సొంత పరచుకుందంటే, అది తన అధికారాన్ని స్థిరంగా ప్రతిష్టించుకుంటుందనీ, అప్పుడు ఏ వ్యక్తులు గానీ, సంస్థలుగానీ, రాజకీయ పార్టీలతో వచ్చే ఏ మార్పులుగానీ దాన్ని కదిలించలేవనీ లెనిన్ వివరిస్తాడు. ఇక సార్వజనీన ఓటింగ్ హక్కు బూర్జువా పాలనను బలపరిచే సాధనమని ఏంగెల్స్ పేర్కొన్న విషయాన్ని లెనిన్ గుర్తు చేస్తాడు. అయితే రష్యాలో ఎస్.ఆర్.లూ (సోషలిస్టు రివల్యూషనరీలు), మెన్షివిక్కులూ తదితరులు మాత్రం ఈ సార్వజనీన ఓటింగ్ హక్కును శ్రామిక ప్రజలలోని మెజారిటీ యొక్క అభీష్టాన్ని వెల్లడించడానికీ, సాధించడానికీ సామర్థ్యం వున్నదనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తున్నారని లెనిన్ విమర్శించాడు.
విప్లవానంతరం కార్మికవర్గం రాజ్యాధి కారాన్ని కైవసం చేసుకొని, మొట్టమొదట ఉత్పత్తి సాధనాలను రాజ్యం ఆస్తిగా మారుస్తుంది. ఆపై సకల వర్గ విభేదాలనూ, వర్గ వైరుధ్యాలనూ రద్దుచేసి రాజ్యాన్ని కూడా రాజ్యంగా రద్దుచే స్తుంది. ఆపై రాజ్యం జోక్యం అనవసరమైపోయి, తనంతతానే కృశించిపోతుందని ఏంగెల్స్ 'ఆంటీడూరింగ్' అనే గ్రంథంలో చెప్పాడు. అందులో ఆయన రాజ్యం 'రద్దవుతుందనీ, కృశించిపోతుందనీ రెండు విషయాలు చెప్పాడు. అయితే అవకాశవాదులు రాజ్యం కృశించిపోతుం దన్న ఒక్క విషయాన్నే స్వీకరించి, మార్క్సిజాన్ని కత్తిరించారని లెనిన్ విమర్శించాడు. ఈ 'ఆధు నిక' సోషలిస్టులు 'రాజ్యాన్ని రాజ్యంగా రద్దు చేస్తుంది' అన్నమాటలకు అర్థమేమిటన్నదాని గురించి ఆలోచించరు. ఏంగెల్స్ కార్మికవర్గం రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని, రాజ్యాన్ని రాజ్యంగా రద్దు చేస్తుందని చెప్పాడు. ఈ మాటలు 1871 నాటి పారిస్ కమ్యూన్ అనుభవాన్ని టూకీగా చెబుతాయి. కార్మికవర్గ విప్లవం బూర్జువా రాజ్యాన్ని రద్దు చెయ్యడం గురించి ఏంగెల్స్ ఇక్కడ చెబుతున్నాడు. ఇక రాజ్యం కృశించిపోవడానికి సంబంధించిన మాటలు సోషలిస్టు విప్లవం తర్వాత వుండే కార్మికవర్గ రాజ్యపు అవశేషాలకు వర్తిస్తాయి. ఆయన అభిప్రాయంలో బూర్జువా రాజ్యం కృశించిపోదు, విప్లవ గతిలో కార్మికవర్గం చేత రద్దు చేయబడుతుంది. ఈ విప్లవం తర్వాత కార్మికరాజ్యం కృశించిపోతుంది. బూర్జువా రాజ్యాన్ని కార్మికరాజ్యం తొలగించడం బలా త్కార విప్లవం లేకుండా అసాధ్యం. ఇక కార్మికరాజ్యం రద్దుకావడం 'కృశించి పోవడం' ద్వారా తప్ప, అసాధ్యం అంటూ మార్క్స్, ఏంగెల్స్‌లు చెప్పిన ఈ విషయాల్ని లెనిన్ విశదీకరించాడు.
రాజ్యం,అనగా పాలకవర్గంగా సంఘటిత పడిన కార్మిక రాజ్యం'' అనే మార్క్స్చెప్పిన అంశం చరిత్రలో కార్మికవర్గంయొక్క విప్లవ కరపాత్రకు సంబంధించిన ఆయనసిద్ధాంతం అంతటిలోనూ ముడిపడివుంది. ఆ పాత్రయొక్క శిఖరదశే కార్మికవర్గ నియంతృత్వం. బూర్జువా వర్గం తనకోసం సృష్టించుకున్న రాజ్యయంత్రాం గాన్ని మొదట రద్దు చెయ్యకుండా, ధ్వంసం చెయ్యకుండా,కార్మికవర్గ నియంతృత్వాన్ని అమలు జరిపే రాజ్యయంత్రాన్ని కార్మికవర్గం సృష్టించ గలదా?
బ్యూరాక్రటిక్, మిలటరీ యంత్రాంగం బలపడటం అనేది ఫ్యూడలిజం పతనమైనప్పటి నుండి యూరప్‌లోని పలు బూర్జువా విప్లవాల న్నింటా కొనసాగింది. ముఖ్యంగా ఈ యంత్రాం గంద్వారా బడా బూర్జువాలవైపు ఆకర్షించబడే దానికి లొంగిపోయేది పెటీ బూర్జువాలు. రైతాంగంలోని పైశ్రేణులు, చిన్నచేతి వృత్తుల వాళ్లు, వర్తకులకు కూడా ఈయంత్రాంగం సాపేక్షంగా సుఖప్రదమైన, గౌరవప్రదమైన ఉద్యోగాలను సమకూర్చి, వారిని పేదప్రజల కంటే మెరుగైన స్థితిలో ఉంచుతుంది. అందువల్లనే బూర్జువా పార్టీలకూ, పెటీబూర్జువా ప్రజాతంత్ర పార్టీలకు కూడా విప్లవకార్మిక వర్గంపట్ల దమనచర్యల్ని తీవ్రం చెయ్యడం అవసరమవుతుంది. సరిగ్గా అందువల్లనే విప్లవం బూర్జువా రాజ్యాధికారాన్నిరద్దు చేయటంపై తనశక్తులి కేంద్రీకరిస్తుంది.రాజ్యయంత్రాన్ని మెరుగుపరచడానికి బదులు, దాన్ని పటా పంచలుచేసి, ధ్వంసం చెయ్యడం తప్పని సరి అవుతుందని లెనిన్ చెబుతాడు.
మార్క్స్ ' కమ్యూనిస్టు ప్రణాళిక' లో బూర్జువా రాజ్యాంగయంత్రం స్థానంలో '' పాలక వర్గంగా సంఘటితపడిన కార్మిక వర్గ రాజ్యాంగయంత్రాన్ని పెట్టాలని చెబుతాడు. అందువల్ల కమ్యూన్ అనుభవం స్వల్పమే అయినా, దాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు ''ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం'' అనే గ్రంధంలో అందులో ఆయన సామ్రాజ్యానికి పూర్తి విరుద్ధమైనది కమ్యూన్ అనీ, కమ్యూన్ యొక్క మొదటి శాసనం స్థాయీ సైన్యన్ని రద్దుచేసి, దానిస్థానంలో సాయుధ ప్రజల్ని పెట్టిందని చెప్పాడు. ఈ విధంగా కమ్యూన్ పటాపంచలైన రాజ్యయంత్రం స్థానంలో పూర్ణతరమైన ప్రజాస్వామ్యాన్ని పెట్టినట్లు కనబడుతుంది. ఈ సందర్భంలో కమ్యూన్ తీసుకున్న కొన్ని చర్యల్ని మార్క్స్ నొక్కి చెప్పాడు. అవి: ఉద్యోగుల సకల అధిక సౌకర్యాలూ రద్దు సకల ప్రభుత్వోద్యోగుల జీతమూ 'శ్రమజీవుల వేతనస్థాయికి తగ్గించ డమూ తదితరాలు ముఖ్యమైనవి, మార్క్స్ నొక్కి చెప్పిన వీటిని అవకాశవాదులు పూర్తిగా ఉపేక్షిం చారు. మరో ముఖ్యమైన చర్య ఏమంటే-ఎటు వంటి మినహాయింపులూలేకుండా సకల ఉద్యోగులూ ఎన్నుకోబడడమూ, ఎప్పుడంటే అప్పుడు దింపబడేట్లు ఉండటమూ-ఈ సరళ స్వయంవ్యక్త ప్రజాతంత్ర చర్యలు ఒకవైపు కార్మికులయొక్క, రైతుల్లో మెజారిటీ యొక్క ప్రయోజనాల్ని పూర్తిగా ఐక్యం చేస్తాయి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థనుండి సోషలిజానికి తీసుకుపోయేవంతెనగా కూడా ఈ చర్యలు పని చేస్తాయి. అయితే ఇవి ఎప్పుడు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయంటే, ఉత్పత్తి సాధనాలు సామాజీకరణ చెందినప్పుడు అంటాడు లెనిన్. పారిస్ కమ్యూన్‌ని పరిశీలించిన మార్క్స్, చిన్నగ్రామమైనా సరే, ఆగ్రామ కమ్యూన్ జాతీయ కమ్యూన్కు ప్రతిరూపంగా వుంటుం దనీ, కమ్యూన్లన్నీ కలిసి పారిస్ లో జాతీయ ప్రతినిధి వర్గాన్ని ఎన్నుకోవలసి వుంటుందనీ రాశాడు.
ఇక రాజ్యంరద్దు విషయమై మార్క్సిజానికీ, అరాచక వాదానికీ మధ్యగల సంబంధం గురిం చి ప్రస్తుత సోషల్ డెమోక్రాట్లు (అవకాశ వాదులు) పూర్తిగా వక్రీకరిస్తున్నారు గనుక, ఆ విషయంలో మార్క్స్ వారితో చేసిన ఒకానొక పోరాట స్వరూపం గురించి లెనిన్ వివరణ ఇచ్చాడు. రాజ్యంరద్దు లక్ష్యంగా ఉండటమనే సమస్యమీద మనం అరాజక వాదులతో విభేదించడం లేదనీ, వర్గాల రద్దుకు పీడిత వర్గపు తాత్కాలిక నియంతృత్వం అవసరమై నట్లుగానే, రాజ్యం రద్దును సాధించడానికి మనం దోపిడీ దారులకు వ్యతిరేకంగా రాజ్యాధికారపు పరికరాల్ని, పద్ధతుల్ని తాత్కా లికంగా వాడుకోవాలనీ లెనిన్ చెప్పాడు.మార్క్స్ 'ఈరకం' రాజ్యం రద్దు విషయంలోనే అరాచక వాదులతో పోరాడాడు తప్ప వర్గాలు అదృశ్యమై నప్పుడు రాజ్యం అదృశ్య మవుతుందన్న విషయాన్ని ఆయన వ్యతిరేకించనేలేదని లెనిన్ స్పష్టం చేశాడు.
రాజ్యం, ప్రజాస్వామ్యం - వీటి సంబం ధంలో రాజ్యం రద్దయినప్పుడు ప్రజాస్వామ్యం కూడా రద్దవుతుందనీ, రాజ్యం కృశించిపోయి నప్పుడు ప్రజాస్వామ్యం కూడా కృశించిపోతుం దనీ చెప్పినప్పుడు, ఈ ఉద్ఘాటన మొదట ఆశ్చర్యకరంగా వుంటుందంటాడు లెనిన్. అలా చెప్పడం ద్వారా, మెజారిటీకి మైనారిటీ లొంగి వుండాలనే సూత్రాన్ని పాటించని సమాజవ్యవస్థ కోసం మనం ఎదురు చూస్తున్నట్లు ఎవరైనా అనుకోవచ్చుననీ, ఎందుకంటే ప్రజాస్వామ్య మంటే ఈ సూత్రాన్ని గుర్తిండమేనని చాలామంది అనుకుంటారనీ లెనిన్ చెబుతాడు. అయితే ప్రజా స్వామ్యమూ, మెజారిటీకి మైనారిటీ లొంగివుం డాలనడమూ ఒకటి కాదని ఆయన చెబుతాడు. అలాలొంగి వుండటమే ప్రజాస్వామ్యమని గుర్తించే రాజ్యం, అంటే ఒక వర్గంమీద మరో వర్గం, ప్రజానీకంలో ఒక భాగం మీద మరో భాగం క్రమపద్ధతిగా బలప్రయోగం చేసే సంస్థ అని చెబుతాడు. అలాంటి బలాత్కారాన్నంతటినీ, అనగా రాజ్యాన్ని రద్దు చేసే అంతిమలక్ష్యం మనది. అంతేతప్ప, మైనారిటీ మెజారిటీకి లొంగివుండటం మన లక్ష్యం కాదు. సోషలిజం కమ్యూనిజంగా అభివృద్ధి చెందుతుందనీ, ఒక మనిషి మరో మనిషి పై, ప్రజానీకంలో ఒక భాగం మరో భాగంపై బలప్రయోగం చేసే అవసరం లేకుండా, సమాజ జీవితపు ప్రాధమిక నియమాలను పాటించడానికి ప్రజలు అలవాటు పడతారని చెబుతాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంనుండి అప్పుడే వచ్చినట్టి, ప్రతివిషయంలోనూ పాత సమాజ ముద్రలను కలిగి ఉన్నట్టి కమ్యూనిస్ట్ సమాజాన్నే మార్క్స్ కమ్యూనిస్టు సమాజపు 'మొదటి' లేదా 'నిమ్నదశ'అన్నాడు. ఆ దశలో ఉద్పత్తి సాధనాలు మొత్తం సమాజానికి చెందుతాయి. సమాజం లోని ప్రతిసభ్యుడూ సామాజిక శ్రమలో భాగ స్వామియై అందుకు ప్రతిఫలం పొందుతాడు. అయితే సమాజం యొక్క మొత్తం సామాజిక శ్రమ నుండి ఉత్పత్తి విస్త ృతీకరణకు, యంత్రాల అరుగుదలను భర్తీ చెయ్యడానికి, వగైరాలకు ఒక రిజర్వు నిధిని తీయాలి. తర్వాత వినియోగ వస్తువుల నుండి పరిపాలన నిర్వహణ ఖర్చులు, పాఠశాలలు, వృద్ధుల వసతి గృహాలు వగైరాలకు ఒక నిధిని తీయాలి. ఈ విధంగా సామాజిక నిధికి పోయే శ్రమపరిమాణం తీసెయ్యబడ్డాక, ప్రతి కార్మికుడూ సమాజానికి తానెంత ఇచ్చాడో అంత సమాజం నుండి పొందుతాడు.ఇక్కడ సమానహక్కు వుందిగానీ, అదింకా బూర్జువా హక్కే.ప్రతి హక్కులో ఉన్నట్టే దీంట్లో కూడా అసమానత్వం ఇమిడివుంది. సమానత్వం అంటే, వాస్తవంలో ఒకలాగా లేని, ఒకరికొకరు సమానంకాని భిన్న వ్యక్తులకు సమానకొలతలు అన్వయింపజేయడం అన్యాయం. నిజానికి ప్రతి ఒక్కడూ మరొకడు చేసినంత సామాజిక శ్రమ చేసి, సామాజిక ఉత్పాదితంలో సమాన భాగాన్ని పొందుతాడు. ( పైన చెప్పిన తీసివేతల తర్వాత )
అయితే మనుషులంతా ఒకేలా వుండరు. ఒకరు బలంగా, మరొకరు బలహీనంగా ఉంటారు. ఒకడికి పెళ్లవుతుంది, మరొకరు ఒంటరిగా ఉంటారు. ఒకరికి పిల్లలెక్కువ, మరొకరికి తక్కువ మంది ఉంటారు. దీన్నుండి మార్క్స్ చేసిన నిర్ధారణ ఇలావుంది :''సమాన శ్రమ నిర్వహణతో, తత్ఫలితంగా సామాజిక వినియోగ వస్తునిధిలో సమాన భాగంతో వాస్తవంగా ఒకడు తనకవసరమైన దానికంటే తక్కువ, మరొకడు ఎక్కువ పొందుతాడు. ఈ లోపాల్ని తొలగించడానికి హక్కు సమానంగా గాక, అసమానంగా ఉండాలి''.కనుక కమ్యూనిజం యొక్క మొదటిదశ న్యాయాన్నీ, సమానత్వాన్నీ ఇంకా సమాకూర్చలేదు. అన్యాయ మైన విభేదాలు ఇంకా కొనసాగుతాయి. కానీ కమ్యూనిజం యొక్క మొదటిదశలో ఇది అనివార్యమేనని ఆయన చెప్పాడు.
కమ్యునిస్టు సమాజపు ఉన్నత దశలో, శ్రమ అనేది జీవనోపాధికి మాత్రమే గాక, జీవితపు ప్రాధమిక అవసరం అయిన తర్వాత, వ్యక్తి సర్వతోముఖ వికాసం జరిగి, ఉత్పాదక శక్తులు పెరిగి, సామాజిక ఐశ్వర్యం పెరిగాక, అప్పుడు బూర్జువాహక్కు సంపూర్ణంగా అధిగమించబడు తుంది. అపుడు''ప్రతి వాని నుండీ వాని సామార్ధ్యాన్ని బట్టి, ప్రతి వానికీ వాని అవస రాన్ని బట్టి '' అని సమాజం తన పతాకమీద రాసుకోగలదు, అంటాడు మార్క్స్.
కమ్యూనిజం అభివృద్ధి అవుతున్న క్రమం లోరాజ్యం పూర్తిగా కృశించిపోతుంది. ఆ ఉన్నత దశలో శారీరక, మానసిక శ్రమల మధ్య భేదం తొలగిపోయి, ఆధునిక సమాజపు అసమానతల యొక్క ఒక ప్రధాన మూలం అంతర్ధాన మవుతుంది. పెట్టుబడిదారుల ఆస్తిహరణం సమాజపు ఉత్పాదక శక్తులను అపారంగా అభివృద్ధి చేస్తుంది. అయితే ఈ అభివృద్ధి ఎంతవేగంగా జరుగుతుంది, శారీరక మానసిక శ్రమలమధ్య భేదం ఎంత త్వరగా రద్దయ్యేదీ మనకు తెలీదు అని లెనిన్ వ్యాఖ్యానించాడు.
తమ సామర్థ్యాన్ని బట్టి పనిచేసేంతగా మనుషులు సామాజిక సంబంధాల మౌలిక నియమాల్ని ఐచ్ఛికంగా పాటించడానికి అలవాటు పడినప్పుడు. మరొకనికంటే తాను కొంత సమయం ఎక్కువ పని చేశానా అని, మరొకని కంటే తక్కువ జీతం వస్తోందా అని హృదయరహితంగా లెక్కకట్టడం అధిగమించబడి నపుడు రాజ్యం సంపూర్ణంగా కృశించిపోతుంది. అప్పుడు సరుకుల పంపకంలో పరిమాణాన్ని నియంత్రించే అవసరం సమాజానికుండదు. ప్రతివాడూ తన అవసరాన్ని స్వేచ్ఛగా తీర్చుకుం టాడని లెనిన్ వివరిస్తాడు.
ప్రస్తుతం జరిగే సామ్రాజ్యవాద యుద్ధంలో ఇరుపక్షాల దేశాలూ మిలటరీ రాక్షసులుగామారి, లక్షలాది జనాన్ని నిర్మూలించే సందర్భంలో, రాజ్యంతో కార్మికవర్గ విప్లవానికిగల సంబంధం ఏమిటనే సమస్యను వికృతపరచడమూ, మూసి పెట్టడమూ సరికాదని చెబుతాడు.కార్మికవర్గం విప్లవానికి నాయకత్వం వహించి బూర్జువా రాజ్యాంగయంత్రాన్ని నాశనం చేసి, దానిస్ధానం లో కార్మికవర్గ రాజ్యాన్ని ఏర్పాటుచేసి, కమ్యూనిస్టు సమాజానికి బాటలు వేయాలని ఉద్భోధిస్తాడు.