
- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు
- దివీస్ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్
విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్ లేబొరేటరీస్‌లోని హెచ్ బ్లాక్‌లో బుధవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి, రా మెటీరియల్ లోడ్ చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గణపతి, భాస్కర్, అసిరినాయుడు అనే ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి.వీరిలో గణపతికి శరీరంపై ముప్పైశాతానికి పైగా గాయాలుకాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ప్రధమచికిత్స అనంతరం అక్కయ్యపాలెంలోని శ్రీచంద్ర ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే చిట్టివలస, విజయనగరం అగ్నిమాపక సిబ్బంది తమ శకటంతో హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిందన్న సమాచారంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు దివీస్ మెయిన్ గేటు వద్దకు చేరుకొని ఆత్రంగా ఎదురు చూశారు.
ప్రమాదం ఏమీ జరగలేదని యాజమాన్యం చెబుతుండగా, చిట్టివలస ఫైర్ అధికారి షేక్ మదీనా చెప్పిన వివరాల ప్రకారం హెచ్ బ్లాక్‌లోని ప్రొడక్షన్ రియాక్టర్‌లోకి రా మెటీరియల్‌ను లోడ్ చేస్తుండగా, నిప్పురవ్వలు ఎగిసిపడి ప్రమాదం జరిగిందని, అరగంటలోపే చేరుకుని మంటల్ని అదుపు చేశామంటున్నారు. ప్రమాదం జరిగిందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న మీడియాను సైతం భద్రతా కారణాల రీత్యా లోపలకి అనుమతించకపోవడంపై స్థానికుల్లో సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కారణాలైమైనప్పటికీ ఫార్మా కంపెనీల్లో ఇటీవలే పలు చోట్ల వివిధ ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దివీస్‌లో జరిగిన ప్రమాద తీవ్రతపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్థానిక తహశీల్దార్ బిటివి రామారావు కూడా సంఘటనాస్థలికి చేరుకుని, ప్రమాదంపై ఆరా తీసి వివరాలు సేకరించారు.
దివీస్ కంపెనీ హెచ్ బ్లాకులో ప్రమాదఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి కె లోకనాథం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి దివీస్ ల్యాబ్ వద్దకు వారు చేరుకుని సంఘటనపై కార్మికులను, స్థానికులను అడిగితెలుసుకున్నారు.వారి వెంట సిఐటియు డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, రవ్వ నర్సింగరావు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలో ప్రేలుడు సంభవించినా దివీస్ యాజమాన్యం కనీసం మీడియాను కూడా కంపెనీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని, కార్మికులకు భద్రతా చర్యలు చేపట్టడంలో తీవ్రమైన లోపాలు వున్నాయని ఈ ఘటన రుజువుచేస్తుందన్నారు. 10 రోజుల క్రితం కంచేరుపాలెంకు చెందిన కాంట్రాక్టు లేబర్ పనిచేస్తుండగా కరెంట్ షాక్ గురైనా, దానిని దివీస్ యాజమాన్యం పట్టించుకోకుండా ఇంటికి పంపించగా, తరువాత ఆమె తీవ్ర అస్వస్థకు గురైంది. సిఐటియు యూనియన్ జోక్యం వలన ఎబిసి హాస్పటల్లో చేర్పించి 4 రోజుల చికిత్స పొందాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరోక కార్మికుడు శ్వాసకోశ వ్యాధితో భాదపడుతుంటే బుధవారం విశాఖ కెజిహెచ్లో చేర్పించారు. ఇలాంటి ఘటనలు దివీస్ కంపెనీలో నిత్యకృత్యం అవుతున్నాయని విమర్శించారు. ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలో తరుచు జరుగుతున్న ప్రమాదాలపౖౖె సమగ్రమైన దర్యాప్తులు చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. కాగా సంఘటనాస్థలిని సందర్శించిన వారిలో వైసిపిజిల్లా కార్యదర్శి సరగడ రఘునాధరెడ్డి, ఐద్వా జిల్లా కార్యదర్శి కె నాగరాణి, ఎస్ అప్పలనాయుడు, కెవిపిఎస్ ఉపాధ్యక్షురాలు బి లక్ష్మి తదితరులున్నారు.