
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ డిమాండ్ చేశారు. ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న సంఖ్యకు, డి అండ్ ఎంహెచ్ కార్యాలయల నుంచి వస్తున్న సంఖ్యకు పొంతన లేకపోవడం ప్రతిబంధకంగా మారిందన్నారు. డి అండ్ ఎంహెచ్ కార్యాలయాల్లో అవినీతి అధికంగా ఉందన్నారు. రికార్డులు సరిగా లేవన్నారు. వీరందర్నీ పర్మినెంటు చేస్తామని ఎన్నికల ముందు అన్ని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయన్నారు. హామీ ఇచ్చిన టిడిపి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘంను వేసిందని, ఈ సంఘం ఒక్క సారి కూడా సమావేశం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా కేవలం 13 వేల మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుందన్నారు. వీరందర్నీ పర్మినెంటు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సెలవులు, ఇఎస్ఐ, హెల్త్ కార్డులు మంజూరుచేయాలని, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వలే మూడేళ్లు సర్వీసు దాటిన వారికి టైం స్కేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మహారాష్ట్రలో ఆరేళ్లు సర్వీసు ఉంటే టైం స్కేలు ఇస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో కూడా టైం స్కేలు ఇచ్చి, తర్వాత పర్మినెంటు చేయాలని డిమాండ్ చేశారు. గంటల లెక్కన వేతనాలు చెల్లించే ఆలోచన సరికాదన్నారు. ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని కోరారు. హక్కుల సాధన కోసం ఆగస్టు 3న విజయవాడలో భారీ ఆందోళన కార్యక్రమం ఉందన్నారు. ఛలో విజయవాడకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.