
అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు. ఆర్థోపెడిక్ సెమినార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి ఎన్ భావన్నారాయణ అధ్యక్షత వహించారు. సన్మాన కార్యక్రమంలో జిజిహెచ్ సూపరెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు మాట్లాడుతూ జిజిహెచ్‌లో వైద్యం ఆలశ్యంగా జరిగినప్పటికీ నాణ్యమైన సేవలను అందిస్తామని, ఎవ్వరినీ చూస్తూ చూస్తూ వదిలివేయబోమన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్లు జిజిహెచ్‌లో ఉన్నారని, వైద్యులందరూ సమన్వయంతో సకాలంలో స్పందించడం వలన ఆంజనేయులు తిరిగి కోలుకోగలిగాడని చెప్పారు. వైద్య నిపుణుల సమిష్టి కృషి ఫలితమే ఆంజనేయులు తిరిగి ఇంటికి వెళ్లడమన్నారు. క్యాజువాలిటి, ఆసుపత్రి అడ్మిన్‌స్ట్రేషన్ అధికారులు, ఎనస్తీషియా, ఆర్థోపెడిక్, న్యూరాలజి, డెంటల్ విభాగాల వైద్యులు సమిష్టి సహకారంతో వైద్య సేవలందించి ఆంజనేయులు ప్రాణాన్ని నిలబెట్టగలిగామని చెప్పారు. 20 ప్యాకెట్ల రక్తం అందించి క్రిటియాస్టమి శస్త్ర చికిత్స చేసి, శ్వాస అందే ఏర్పాటు చేశామన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిజిహెచ్‌కు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. 12మంది వైద్య నిపుణుల బృందం గొప్ప వైద్య సేవలు అందించి ఆంజనేయులు ప్రాణాన్ని కాపాడటం హర్షణీయం అని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ వైద్యం తెలిసినప్పటికీ దాన్ని డబ్బు సంపాదించే వృత్తిగా చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఉచితంగా అరుదైన శస్త్రచికిత్సలను అంకిత భావంతో చేయడం సర్వత్రా ప్రశంసనీయమని పేర్కొన్నారు. జిజిహెచ్, జిఎంసి వైద్య నిపుణులు స్పూర్తి దాయకంగా నిలిచారని పేర్కొన్కారు. అత్యవసర సేవలందించిన వైద్య నిపుణులు ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు ప్రాఫెసర్ డాక్టర్ వరప్రసాద్, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్ వేణుగోపాల్, ఇఎన్‌టి వైద్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, న్యూరాలజీ సర్జన్ డాక్టర్ బాబ్జీ శ్యామ్‌కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజునాయుడు, నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత, హెచ్ నర్స్ రోజా తదితరులను సిపిఎం నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆంజనేయులుకి వైద్యం అందించడంలో ఎదురైన అనుభవాలను వైద్య నిపుణులు తెలియజేశారు.