
రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో వామపక్షాల కార్యకర్తలు కదంతొక్కారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాకపోవడంతో ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. వామపక్షాల నేతృత్వంలో 15 రోజుల పాటు సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సుయాత్ర సాగింది. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ-సాగునీటి ప్రాజెక్టులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలి.. డిమాండ్లతో వామపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో పాల్గొనడానికి సీమ జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.