
- ఎమ్‌డి ఛాంబర్లో రైతులు, కార్మికుల బైటాయింపు
- తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
- బాలకృష్ణ, ఫణిరాజ్, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు
తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎమ్‌డి ఛాంబర్ లోపలకు చొచ్చుకెళ్లి ఎమ్‌డి సత్యప్రసాద్ ఎదుట బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమితి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సమితి కన్వీనర్ ఎ.బాలకృష్ణ, కో-కన్వీనర్ ఫణిరాజ్, ఆప్ నాయకులు హరినాథబాబులపై కేసులు బనాయించి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి....
తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి క్రషింగ్ నిర్వహించాలని, ఫ్యాక్టరీ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని, కార్మికులకు, రైతులకు బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీని సహకార రంగంలోనే నడిపించాలని కోరుతూ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన 29 రోజులుగా ఫ్యాక్టరీ ఆవరణలో నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం విధితమే. అయితే వీరి ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు, రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. మంగళవారం ఉదయం దీక్షా శిబిరానికి పెద్ద ఎత్తున చేరుకున్న వీళ్లు సమితి కన్వీనర్ ఎ.బాలకృష్ణ, కో- కన్వీనర్ జి.ఫణిరాజ్, కార్మిక నాయకులు విల్లూరి నర్సింగరావు ఆధ్వర్యంలో ఎమ్‌డి ఛాంబర్‌కు వెళ్లి ఎమ్‌డిని కలిసి అక్కడే బైటాయించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడే ఉంటామని, అవసరమైతే మూకుమ్మడిగా ఆత్మహత్యలకు వెనుకాడమని స్పష్టం చేశారు. మీతో పాటు మాకు కూడా జీతాలు లేవని, అందరమూ దిగ్బంధానికి దిగుదామని ఎమ్‌డి సత్యప్రసాద్ అన్నారు. ఈ క్రమంలో ఎమ్‌డి కార్యాలయానికి వచ్చే తలుపులను మూసివేసి అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరవాలని కోరారు. 18 నెలల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇస్తేనే గాని ఆందోళన విరమించేది లేదని కార్మికులు తగేసి చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణ సిఐ చంద్ర సంఘటనా స్థలానికి చేరుకొని కిటికిలోనుంచే కార్మిక నాయకులతో మాట్లాడారు. అయినా కార్మికులు శాంతించలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనకాపల్లి, అనకాపల్లిరూరల్, కశింకోట, మునగపాక ఎస్ఐలు, హరి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్‌తో ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు అక్కడ మోహరించారు. మళ్లీ కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. ఎమ్‌డిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎమ్‌డి సహకరిస్తున్నాడని ఆయనను నిర్బంధించలేదని అందరితో పాటే ఆయనా కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారని పోలీసుల దృష్టికి తెచ్చారు. ఎమ్డితో కిటికి దగ్గరకొచ్చి సిఐ చర్చించారు. ఎమ్‌డి బయటకు రావడానికి అంగీకరించారు. అయితే పోలీసులందరూ కిందకెళితేనే తలుపు తీస్తామని సమితి నాయకులు షరతు విధించారు. ఎమ్‌డి సత్యప్రసాద్‌ను బయటకు పంపారు. ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్, ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌ఛార్జి జె.నివాస్‌తో మాట్లాడించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు.
ఈ క్రమంలో లోపల ఉన్నవారు బయటకు రావాలని పోలీసులు హుకుంజారీ చేశారు. అందుకు వారు నిరాకరించారు. ఈ సమయంలో డిఎస్పి పురుషోత్తం ఆవేశంతో సంఘటనా స్థలానికి చేరుకొని బయటకొస్తారా? తలుపు బద్దలుకొట్టాలా అంటూ హెచ్చరించారు. ఏమి చేసినా చావో రేవో ఇక్కడేనని కార్మికులు తెగేసి చెప్పారు. దీంతో బయట ఉన్న కార్మికులను లోపలకు రాకుండా అడ్డగించి, ఛాంబర్ తలుపులను బలవంతంగా బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. ఛాంబర్లో ఉన్న కార్మికులపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. సమస్యను చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పోరాట కమిటీ కన్వీనర్ ఎ.బాలకృష్ణ, కో- కన్వీనర్ జి.ఫణిరాజ్, కార్మిక నాయకులు విల్లూరి నర్సింగరావు, రైతు సంఘం నాయకులు పెంటకోట జగన్నాధం, బద్రీనాధ్ల సహా 9 మందిని పోలీసు జీపు వరకు లాక్కెళ్లి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగిలిన కార్మికులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా పోలీసుల దాటికి వారు వెనుకడుగు వేశారు.