
కేరళ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సోలార్ కుంభకోణం కేసు దర్యాప్తు విజిలెన్స్ కమిషన్ చేతుల్లోకి రావటం, విజిలెన్స్ కోర్టు మొట్టికాయలు, ఎక్సైజ్ మంత్రి రాజీనామా, న్యాయమూర్తిపై మంత్రి తిట్ల దండకం, విజిలెన్స్ కోర్టు ఆదేశాలపై హైకోర్టుస్టే, మంత్రిగారి పున్ణప్రవేశం, హోం మంత్రి రమేష్ చెన్నితల, ఆరోగ్య మంత్రి శివకుమార్‌పై తాజా ఆరోపణలు, ముఖ్యమంత్రి లంచాల బాగోతంపై సరిత తాజా ఆరోపణలు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కుంభకోణం మలుపుల జాబితా అనంతంగా సాగిపోతూనే వుంటుంది. అయితే ఈ ఘటనలన్నీ అంతర్లీనంగా ఒకదాదనితో ఒకటి ముడిపడి వుండటం విశేషం. ముఖ్యమంత్రి చాందీ, ఆయన మంత్రివర్గ సహచరులపై తాజాగా లంచం ఆరోపణలతో ఈ మెగా సోలార్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. సరిత విసిరిన గూగ్లీలతో ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు కొంత వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడింది.