
రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్డిఏ అధికారులు తేల్చిచెప్పారు. తమ గ్రామాల్లో భూములివ్వనప్పుడు మేము పొలాలు ఇవ్వబోమని, వెంటనే సాగుచేసుకుంటామని అధికారులకు చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో తమకు కేటాయించాల్సిన ప్లాట్లు చూపలేదని, నమ్మి భూములిస్తే నట్టేట ముంచుతారా ? అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు.