
ప్రభుత్వం నాటకాలాడుతోందని, బాక్సైట్ జివోను తాత్కాలికంగా రద్దు చేసినట్లు మాట్లాడినా వాటి ప్రమాదం, బాక్సైట్ ఒప్పందాల ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం గిరిజనాన్ని హెచ్చరించారు. అందుకే ఆ బాక్సైట్ ఒప్పందంపైనే ప్రధానంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజనోద్యోగుల భవనంలో ఆ పార్టీ ఏజెన్సీ 11 మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడితే జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లో 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. సప్పర్ల, జెర్రెల, జికెవీధి, గాలికొండ కొండల్లో తవ్వకాలు చేపడితే పరిసర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతాయన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులు జీవనాధారంలేక నిరాశ్రుయులవుతారన్నారు. కాఫీ తోటలు, సెలయేళ్లు, పచ్చికబయళ్లు, పచ్చని పంటపొలాలు, అడవులు నాశనమవుతాయని, మైదానానికీ ఈ ప్రమాదం ఉందని చెప్పారు. మైదాన ప్రాంతాల్లో తాగు, సాగునీరు అందిస్తున్న తాండవ, శారదా, తాటిపూడి, రైవాడ నదులు కలుషితమౌతాయన్నారు. గిరిజన సాంస్కృతి, సాంప్రదాయాలు పశుపక్షాదులు జలపాతాలు కనుమరుగు అవుతాయన్నారు. దిల్లీకి చెందిన ఎనర్జీస్ రిసోర్సు ఇన్సిస్టూట్ బాక్సైట్‌పై అధ్యాయనం చేసి తన నివేదికలో వేల కోట్ల రూపాయల విలువైన పర్యావరణ సంపదకు నష్టం వాటిల్లుతుందని పేర్కొందని, కాగ్ సైతం బాక్సైట్ ఒప్పందాలను తప్పు పట్టినప్పటికీ గద్దెనెక్కే ప్రభుత్వాలు ఇమేమి పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం గిరిజనుల జీవితాలను పనంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నారన్నారు. బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేసేంత వరకూ తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం, గిరిజన సంఘంనాయకులు ఎస్.రమేష్, కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్శ, బోనంగి చిన్నయ్యపడాల్, ఎస్.శంకురాజు, M.అప్పలరాజు, ఆర్శంకరావు, గడుతూరి సత్యనారాయణ, అంపురంగి బుజ్జిబాబు పాల్గొన్నారు.