AIKS రాష్ట్ర మహాసభలు..

అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, సంఘటితంగా పోరాడదామని అఖిల భారత కిసాన్‌ సభ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్‌ పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా సుమారు 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోడీ పాలన చేపట్టాక రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా 450 పైచిలుకు బహిరంగ సభల్లో నరేంద్ర మోడీ రైతులపై వరాల జల్లు కురిపించారని, అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆయన అసలు బండారం బయటపడిందని మండిపడ్డారు.