
ముస్లింలు దేశంలో నివసించాలంటే ఆవు మాంసం తినడం మానుకోవాల్సిందేనని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశంలోని పలు సంఘాలు, రాజకీయ నేతల నుంచి పెద్దయెత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఖట్టర్ వాఖ్యలపై ముస్లింలు ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. భారతదేశం ఒక్క ఖట్టర్‌దే కాదని, ఈ దేశం ఆయనకెలాంటిదో, ప్రతి ముస్లింకు అలాంటిదేనని ఎన్‌సిపి అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ముంబయిలో విలేకరులతో అన్నారు. అందరి పట్ల సమానంగా ప్రవర్తిస్తానని చేసిన ప్రమాణాన్ని ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఆయన విమర్శించారు..