
పశ్చిమ బెంగాల్లో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుశాంత రంజన్ ఉపాధ్యాయ చేసిన రాజీనామా ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ దురహంకారాన్ని కళ్లకు కట్టింది. సుశాంత్ రంజన్ రాజీనామాచేస్తూ 'ఒక రాజకీయ పార్టీకి ఇది తగని పని. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరాదు' అంటూ మమత పార్టీపై చేసిన ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేట్ దిగ్గజాలు, మత ఛాందసులు, మావోయిస్టుల అండదండలతో 'పరివర్తన్' పేరిట 2011లో కొల్కతా గద్దెనెక్కినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ అరచాక దాడులకు బెంగాల్ ఆలవాలమైంది. గద్దెనెక్కుతూనే తృణమూల్ ప్రభుత్వం వామపక్షాల, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు అనుయాయులపైనా, కార్యాలయాలపైనా దాడులకు దిగింది. ప్రజల ప్రజా స్వామ్య హక్కులను కాలరాయడం ప్రారంభించింది. చివరికి తనకు మద్దతిచ్చిన మావోయిస్టులను కూడా ఎన్‌కౌంట్ పేరిట మట్టుబెట్టే చర్యలకు దిగింది. గత ఆగస్టు 27న రైతన్నల పక్షాన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించినప్పుడు, సెప్టెంబర్ 2న కార్మికజన శ్రేయస్సు కోసం సార్వత్రిక సమ్మెలో కదంతొక్కినప్పుడు వామపక్షాల నాయకులపైనా, కార్యకర్తలపైనా తృణమూల్ ప్రదర్శించిన పైశాచికత్వాన్ని చూసి సభ్య సమాజం దిగ్భ్రాంతి చెందింది. శాంతియుత ప్రదర్శనలపై పోలీసుల దాడులతో కొల్కతా వీధులు రక్తంతో తడిశాయి. లెఫ్ట్‌ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు, సీనియర్ నేతలు మహ్మద్ సలీం, దీపక్ దాస్ గుప్తా వంటి నాయకులతో పాటు వందలాది మంది వామపక్ష కార్యకర్తలు గాయాలయ్యారు. ప్రజాసమస్యలపై ప్రదర్శనలు నిర్వహించినప్పుడే కాదు.. ప్రభుత్వ తీరుపై సద్విమర్శలు చేసిన కళాకారులపైనా, కార్టూనిస్టులపైనా, విద్యార్థులపైనా, అవినీతి చర్యలను ప్రశ్నించిన మీడియాపైనా తృణమూల్ భయోత్పాత దాడులు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు హద్దేలేకుండాపోయింది. రిగ్గింగ్‌కు పాల్పడిన తన శ్రేణులను మమత సర్కార్ నిసిగ్గుగా వెనుకేసుకొచ్చింది.
ఇలాంటి అప్రజాస్వామిక చర్యల నుంచి మమత పార్టీ ఇప్పుడు బయటపడాలన్నా సాధ్యమయ్యే సూచనల్లేవు. ఒక తెగలోని ఒక సెక్షన్ తాము చేసివన్నీ తమ గుంపు సహజ లక్షణాలని విశ్వసించినప్పుడు వారిని మార్చడం అంత సులువు కాదని జార్జీ బెర్నార్డ్్ షా అంటారు. అలానే హింసోన్మాదం, అధికార మదాందకారమే తమ పార్టీ సహజ లక్షణాలుగా విశ్వసించిన తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అరాచక మత్తులో జోగుతున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ అనేది దేశ రాజకీయాల్లో కొత్తకాకపోవచ్చు కానీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దానిని వ్యవస్థీకృతం చేసింది. ప్రత్యర్థులపై భౌతిక దాడుల చేసి ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడం, ప్రజలను భయభ్రాంతులను చేసి పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా చేయడం, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడటం వంటి దారుణాలకు ఒడిగడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా హింసోన్మాద పద్ధతుల్లోనే నెగ్గుకొచ్చే అప్రజాస్వామిక పరివర్తన్కు అలవాటైపోయింది. ఇటీవలి సాల్ట్‌లేక్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానీయకుండా అడ్డుకోవడం వంటి చర్యల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అసలు ఓటర్లు తమ ఇళ్లనుండి బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేకపోవటంతో అధికార కూటమికి చెందిన బోగస్ ఓటర్లు యదేచ్ఛగా 'తమ పార్టీ'కి ఓట్లు వేసుకున్నారు.
సిగ్గుచేటైన ఇటువంటి అకృత్యాలు అధికార పార్టీకి క్రమంగా ఆత్మవిశ్వాసం, నైతికత తగ్గుతోందన్న విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ చేతనం నిండుగా ఉన్న బెంగాల్ ప్రజానీకంలో 'పరివర్తన్' భ్రమలు తొలగిపోతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలకు అడ్డుకట్టవేస్తున్నారు. అధికార దాడులను ఎదుర్కొని ధీరోదాత్తంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ప్రజా స్వామ్యయుతంగా ఎన్నికలు జరిగిన చోట ప్రజలు ఎర్రజెండాకు జేజేలు పలుకుతా రన్న విషయాన్ని ఇటీవలి సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ముహాకుమా పరిషత్ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కుట్రలను, దౌర్జన్యాలను ఎదిరించి వామపక్షాలకు ఓటర్లు పట్టం కట్టారు. ఆర్నెల్ల క్రితం సిలిగురి నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పుడు సిలిగురి మహాకుమా పరిషత్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకుగాను ఆరుస్థానాల్లో విజయభేరి మోగించింది. 2009 ఎన్నికల్లో సాధించినదానికన్నా రెండు సీట్లు అదనంగా లెఫ్ట్ సాధించడం ప్రజామద్దతుకు నిదర్శనం. సిపిఎం సీనియర్ నేత భట్టాచార్య మాటల్లో చెప్పాలంటే వరున విజయాలనందించిన సిలిగురి బెంగాల్‌కే ఆదర్శంగా నిలుస్తుంది. ఓటర్లకు భద్రతాభావాన్ని కలుగ చేస్తే, బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే అరాచక తృణమూల్ కాంగ్రెస్‌కు 2016 ఎన్నికల్లో సమాధి కట్టడం ఖాయమని సిలిగురి సంకేతమిస్తోంది.