అసహన ప్రతిరూపం..

ఒకానొక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం ఎంతైనా ఆందోళనకరం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు సర్కార్లే నడుం కట్టడం అత్యంత ప్రమాదకరం. నిరసనోద్యమాలు, ప్రజాందోళనలపై చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో మానవ హక్కుల హననం చేసి ఉక్కుపాదం మోపడం ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఇటీవల ఇద్దరు మావోయిస్టులపై జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు సెప్టెంబ‌ర్‌ 30న చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, భగం చేసేందుకు కెసిఆర్‌ సర్కారు చేయని పని లేదు. తొక్కని అడ్డ దారి లేదు. చట్ట పరిధిలో పని చేస్తున్న 371 సంస్థలు చేపట్టిన ఆందోళనలో చట్ట వ్యతిరేకులు, అసాంఘిక శక్తులు, అల్లరి మూకలు చేరి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని టిఆర్‌ఎస్‌ సర్కారు అనుమతి నిరాకరించి ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన నిరసన హక్కును చిదిమేసింది. 'చలో అసెంబ్లీ' విజయవంతమైతే ఎక్కడ తమ పరువు పోతుందోనన్న దుగ్ధతో అడ్డగోలుగా పోలీసులను ప్రయోగించింది. వేలాది మందిని నిర్బంధించింది. అర్థరాత్రి అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల కార్యాలయాల వద్ద నిఘా, నాయకుల ఇళ్ల ముట్టడి... ఇంకా అనేకానేక అణచివేత పద్ధతులను అవలంబించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులు, చివరికి విశ్వవిద్యాలయాల్లో సైతం ఖాకీలే రాజ్యమేలారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లలో కుక్కారు. హైదరాబాద్‌లోనైతే ముళ్ల కంచెలు, బారికేడ్లు, సాయుధ పోలీసుల పహారా, నగర పౌరుల రాకపోకలపై ఆంక్షలు, వందలాది మంది అరెస్టులతో కర్ఫ్యూ వాతావరణం కల్పించింది. ప్రభుత్వ దారుణ దమనకాండ నిరసనకారులను అడ్డుకోలేకపోయింది. ప్రజల ఆకాంక్షలను అదుపు చేయలేమని ఇప్పటికైనా కెసిఆర్‌ ప్రభుత్వానికి అర్థమై ఉండాలి.
నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన కెసిఆర్‌ అధికారంలోకొచ్చాక బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపడంపై మాజీ నక్సల్స్‌, వారికి మద్దతిచ్చేవారు ఆందోళన చెందడం సహజం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతిచ్చినప్పుడు స్వీకరించిన టిఆర్‌ఎస్‌, ఇప్పుడు తమకు మద్దతిచ్చిన వారిపై తుపాకులు గురిపెట్టడం ద్వంద్వ నీతి అనే వారూ ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు మావోయిస్టులను వాడుకున్న మమతా బెనర్జీ అధికారంలోకి రాగానే కిషన్‌జీ సహా పలువురిని 'ఎన్‌కౌంటర్‌' చేయడం తెలిసిందే. తమను మమత మోసం చేసిందని మావోయిస్టులు ప్రకటించారు కూడా. 'ఎన్‌కౌంటర్లు' పాలకవర్గ పార్టీల విధానం. బూర్జువా పార్టీ ఏది అధికారంలో ఉన్నా తనకు ఇబ్బంది కలగనంత వరకు చూసీచూడట్లు పోతుంది. ఇబ్బంది కలిగిందో అప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. తెలంగాణలో అయినా, ఆంధ్ర ప్రదేశ్‌లో అయినా, బెంగాల్‌లో అయినా తత్వం ఇదే. గతంలో ఎన్డీఆర్‌ నక్సలైట్లను సోదరులన్నారు, ఏం జరిగింది? వైఎస్‌ చర్చలన్నారు, ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయి? కాసు, జలగం, నేదురుమల్లి, చంద్రబాబు హయాంలలో పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారు. ప్రభుత్వాలు చట్టాలను, పౌర హక్కులను ఉల్లంఘిస్తే చట్ట విరుద్ధంగా పని చేసే తీవ్రవాదులు, ఉగ్రవాదులకు, వాటికి తేడా ఏముంటుంది? ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వేస్తున్న ఈ మౌలిక ప్రశ్నను జీర్ణించుకోలేకనే పాలకులు నిరసనల పీచమణచడానికి వెనుకాడట్లేదు.
ఎపిలో బహుళజాతి సంస్థలు, ప్రైవేటు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజాందోళనలంటే గంగవెర్రులెత్తుతోంది. అమరావతిలో భూ సమీకరణ, భూ సేకరణలపై రైతుల్లో నిరసనలను అణిచిపెట్టేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించింది. పోలాకి, భోగాపురం, మచిలీపట్నం, అన్నింటా నిర్బంధం అమల్లో ఉంది. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మృతిపై విద్యార్థుల్లో మిన్నంటిన నిరసనలను తొక్కేసేందుకు విద్యార్థి సంఘాలనే రద్దు చేయాలంది. విద్యార్థులెవరూ ప్రదర్శనల్లో పాల్గొనవద్దని పోలీసులు పోస్టర్లు వేశారంటే ప్రభుత్వ నిరంకుశత్వం అర్థమవుతుంది. విశాఖపట్నంలో విద్యార్థులపై పాశవిక లాఠీఛార్జి సర్కారు దమననీతికి పరాకాష్ట. మున్సిపల్‌ కార్మికులు, స్కీం వర్కర్ల సమ్మెలు, ఆందోళనలపైనా పోలీస్‌ ఉక్కు పాదమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రధాన ప్రతిపక్ష నేత నిరశన దీక్షకు అనుమతి నిరాకరణ తెలిసిందే. ప్రభుత్వ ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి పెను ముప్పు. ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతపై అసహన రూపమే ప్రభుత్వాల నియంతృత్వ చర్యలు. పౌర హక్కుల సాధనకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కటై ఉద్యమిస్తేనే సర్కారీ నిర్బంధానికి ముకుతాడు పడుతుంది.