
ఈ నెల 25, 26, 27 తేదీల్లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో సిపిఎం రాష్ట్ర ప్లీనం సమావేశాలు నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ప్లీనం జయప్రదం కోసం ఆదివారం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగిన తొమ్మిది నెలల తర్వాత జిల్లాలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సమావేశాల్లో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీ నిర్మాణం, రాజకీయ చైతన్యం వంటి అంశాలపైనా చర్చిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశాలకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు.