SFI నాయకుల విడుదల..

నారాయణ కాలేజీ విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి మృతికి కారణమైన వారిని వదిలేసి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌ ప్రశ్నించారు. లాఠీలు, తూటాలు, అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు. కడప నారాయణ కాలేజీలో విద్యార్థినుల మృతికి నిరసనగా ఆందోళన నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు, జగదీష్‌, సుబ్బారెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు శంకర్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారు మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మహిళా పాలిటెక్నిక్‌ విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ.. నారాయణ మంత్రి కాబట్టే పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన విద్యాసంస్థల్లో 14 నెలల్లో 11 మంది చనిపోతే ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోడం దారుణమన్నారు.