SFI కలెక్టరేట్ల ముట్టడి..

రాష్ట్రంలోని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికిస్తున్న మెస్‌ ఛార్జీ రూ.750 నుంచి రూ.1500లకు పెంచాలని, 50 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే సాకుతో మూసివేసిన 220 హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతపురం, కర్నూలు, కడప కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. కర్నూల్లో పదిమందిని అరెస్టు చేశారు. అనంతపురంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్‌ చేరుకొని ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్లు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈక్రమంలో విద్యార్థులకు గాయాలయ్యాయి. నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకోవడంతో సాధ్యం కాలేదు. ఉద్రిక్తత రెండు గంటలసేపు కొనసాగింది. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. అనంతరం పది మంది నాయకులను అరెస్టు చేశారు.