
కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సమ్మెకు విస్తృత సన్నాహాలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలంతా సమ్మెలో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి కె.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. నేతాజీ మాట్లాడుతూ సమ్మెలో దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే సమ్మె జరుగుతుందని చెప్పారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్‌వాడీల వేతనాలు పెంచుతున్న ప్రకటించి జివో విడుదల చేయలేదన్నారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం ఐసిడిఎస్ పని కాకుండా ఇతర సర్వీసులు బిఎల్‌వో డ్యూటీలు చేయించటం సరికాదన్నారు.