
ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ (ఒఆర్‌ఒపి) విధానం అమలుపై ప్రధాని మోడీ నోరు విప్పాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ డిమాండు చేశారు. ఒన్ ర్యాంక్, ఒన్ పెన్షన్ అమలు చేయాలని డిమాండు చేస్త జంతర్ మంతర్ వద్ద సోమవారం నుంచి ఇద్దరు మాజీ సైనికోద్యోగులు నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. గత అనేక నెలలుగా మాజీ సైనికోద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిపిఎం తరపున సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ కూడా వీరికి సంఘీభావం తెలిపారు. తమకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బృందా కారత్‌ను మాజీ సైనికోద్యోగులు స్వాగతం పలికారు. గత కొంత కాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న మాజీ సైనికోద్యోగులపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆమె ఖండించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఒన్ ర్యాంక్, ఒన్ పెన్షన్ అమలు చేయాలన్న సహేతుకమైన డిమండ్ సాధనకు మాజీ సైనిక సిబ్బంది ఉద్యమిస్త్తుంటే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో రోల్ అవుట్ పెన్షన్ పథకం ప్రకటించడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పొందుపరిచేవారని, కాని మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రసంగంలో కూడా పేర్కొనకపోవడం మాజీ సైనికోద్యోగుల పట్ల ఆయన నిర్లక్ష్యానికి దర్పణం పడుతోందని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు జరిగే ఉద్యమానికి సిపిఎం అండగా ఉంటుందని ఆమె వారికి ఇచ్చారు.