LICని కాపాడుకుందాం:CITU

ఎల్‌ఐసి, ఏజెంట్ల రక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్‌ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గురువారం ఎల్‌ఐసి ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యాన 4వ ఆలిండియా కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఐసినీ, ఏజెంట్ల వ్యవస్థనూ నిర్వీర్యం చేయడం జాతి వ్యతిరేక చర్య అని, ఈ అంశంలో కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.స్టాక్‌ మార్కెట్‌లలో పింఛన్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ సొమ్మును పెట్టడాన్ని అందరూ వ్యతిరేకిం చాలన్నారు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఎల్‌ఐసి ప్రజలతో పొదుపు చేయించడంలో, వారి డబ్బుకు రక్షణ కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంద న్నారు. ప్రయివేట్‌ బీమా కంపెనీలు ఆ పని చేయడంలేదని గుర్తు చేశారు. ఎల్‌ఐసితోపాటు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని బీమారంగాన్ని విదేశీ సంస్థల పాలు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని దుయ్యబ ట్టారు. ఎల్‌ఐసి ఏజెంట్లు సంస్థ రక్షణతోపాటు ఏజెంట్ల హక్కులను కాపాడుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.