ICDS నిర్వీర్యానికి కుట్రలు..

''తిండి కలిగితె కండ కలదోరు-కండ కలవాడేను మనిషోరు'' అని చెప్పిన మహాకవి గురజాడ 153వ జయంతి ఇటీవల జరిగింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ లకు పౌష్టికాహార కల్పన, శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా 1975 అక్టోబర్‌ రెండున దేశంలో కేవలం 33 ప్రాజెక్టులతో ప్రారంభమైన ఐసిడిఎస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసు కొంది. నేడు 13.40 లక్షల అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా 10 కోట్ల మందికి పైగా సేవలంది స్తున్నది. ఇందులో 8.41 కోట్ల మంది ఆరేళ్ల లోపు పిల్లలు, 1.9 కోట్ల మంది గర్భిణీ, బాలింత స్త్రీలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహి స్తున్న డాష్‌బోర్డు (వెబ్‌సైట్‌) ప్రకారం 2015 అక్టోబర్‌ 1 నాటికి రాష్ట్రంలో 5,60,120 మం ది ఒక సంవత్సరం లోపు పిల్లలకు, 3,88,087 మంది గర్భిణీ, బాలింత మహిళలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందుతున్నాయి. 4,54,469 మంది సంవత్సరం లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. 2,44,809 మందికి అనుబంధ పోషకాహారాన్ని అంది స్తున్నారు. దీంట్లో అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు చేసిన కృషి కీలమైనది. ''మూడు దశాబ్దాల ఐసిడిఎస్‌'' పేరిట కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదికలో కూడా పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ఐసిడిఎస్‌ ముఖ్యమైన పాత్ర నిర్వహించిందని పేర్కొంది. ఒకవైపు మాతృ, శిశు మరణాల తగ్గింపు, సహ స్రాబ్ది లక్ష్యాల సాధన వంటి మాటలు చెబుతూనే మరోవైపు అంగన్‌వాడీల ద్వారా ప్రయోజనం పొందుతున్న తల్లీ బిడ్డలకు, వీటి అమలులో ముఖ్యమైన అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల సంక్షే మానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి.
అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలకు భావి భారత పౌరులైన పిల్లల, వారిని కనే తల్లుల ఆరోగ్యం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే 40 సంవత్సరాలు పూర్తయినా నేటికీ ఐసిడిఎస్‌ను ఒక చట్టపరమైన విధానంగా కాకుండా ఒక పథకంగానే కొనసాగిస్తున్నారు. తల్లీపిల్లల ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన, మాతృ, శిశు సేవలు మున్నగు వాటిని అత్యవసర ప్రజా సేవల క్రింద పరిగణించడం లేదు. ఐసిడిఎస్‌ ప్రాముఖ్యతపై సుప్రీంకోర్టు 2001లో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సమగ్రాభివృద్ధికి ఐసిడిఎస్‌ చాలా ముఖ్యమైనదని, దీన్ని సార్వత్రీకరించాలని (యూనివర్సలైైజ్‌ చేయాలని), దేశంలోని పిల్లలందరికీ ఐసిడిఎస్‌ సేవలు అందించాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. లబ్ధిదారులకు ఏవిధమైన పౌష్టికత కలిగిం చాలనే దానికి ప్రమాణాలు నిర్ణయించటమే కాకుండా దాని అమలుకు, అభివృద్ధికి సంబంధించిన నివేదికలు ఇవ్వాలని కూడా చెప్పింది. అయినా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోవడంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభిశంసిస్తూ వరుసగా ఆర్డర్లు జారీ చేసింది. దీంతో 2005లో సార్వజనీనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించవలసివచ్చింది. తరువాత 2011లో దేశవ్యాప్తంగా 14 లక్షల నివాస ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను అదనంగా మంజూరు చేసింది. కానీ వేలాది అంగన్‌వాడీ కేంద్రాలలో వర్కర్లను, హెల్పర్లను నియమించలేదు. ఇప్పటికీ మొత్తం 6 సంవత్సరాల లోపు పిల్లల్లో 50 శాతానికి మాత్రమే ఐసిడిఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, ఇతర బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలన్నింటికీ ఐసిడిఎస్‌ సేవలు అందజేసే విషయంలో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టమైన సమాధానమిచ్చే స్థితిలో లేదని కాగ్‌ నివేదిక సైతం విమర్శించింది. ఇలాంటి స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా, శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించాలి. పౌష్టికాహార సరఫరాకు, అన్ని ఖాళీల భర్తీకి పటిష్ట చర్యలు తీసుకోవాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఐసిడిఎస్‌ పథక నిధులకు తీవ్ర కోత విధించింది. 2014-15 బడ్జెట్‌లో రూ.18,195 కోట్లు కేటాయించగా ఈ ఏడాది (2015-16) రూ.8,335.77 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే సగం కంటే ఎక్కువగా కోతపెట్టారు. ఇక ప్రభుత్వం తగినన్ని నిధులివ్వదు గనుక ఆ బాధ్యతను ప్రైవేటుకు వదిలేయాలని చూస్తోంది. అందులో భాగంగానే బహుళజాతి సంస్థ 'వేదాంత'కు 10 రాష్ట్రాల్లోని 4,000 అంగన్‌వాడీ కేంద్రాలను అప్పగించ ేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఒప్పం దం చేసు కుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే త్వరలోనే రాష్ట్రంలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేటీకరిస్తారన్నమాట. వేదాంతకు అను బంధంగా ఉన్న 'కెయిర్న్‌ ఇండియా' సంస్థ పేరిట జరిగిన ఈ ఒప్పందం చెల్లుబాటుపైనే సందేహాలున్నాయి. కెయిర్న్‌ ఇండ ియాను వేదాంతలో విలీనం చేసుకోవడంపై అనేక వివాదా లున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఆ వివాదా ల్లోంచి బయట పడడానికి, పన్నులు ఎగ్గొట్టడానికీ 'వేదాంత' కుయుక్తులు పన్నుతోంది. అంతే తప్ప పేదలపై ప్రేమతో కాదు. అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్తిగా స్థానిక ప్రజల ఆహారాన్ని తాజాగా అందించాలని 2004లోనే సుప్రీంకోర్టు ఆదేశిం చింది. కానీ ప్రభుత్వాలు ఆ ఆదేశాలను తోసి రాజంటూ కొన్ని చోట్ల అక్షయపాత్ర, ఇస్కాన్‌, తదితర సంస్థలతో ముందుగా వండిన ఆహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్రాల నిర్మాణాన్ని మాత్రమే గాక నిర్వహణకు సంబంధించిన పనులనూ కార్పొరేట్ల పరం చేయడం ఘోరమైన విషయం. దాదాపు సగానికి సగం అంగన్‌వాడీ కేంద్రాలు చాలీచాలని ఇరుకు గదుల్లో, అద్దెకు తీసుకున్న ఇళ్లల్లో నడుస్తున్నాయి. కొన్ని కమ్యూనిటీ హాల్స్‌లోనూ, ఎలిమెంటరీ స్కూల్సులోనూ నడుస్తున్నాయి. వంట చేసేందుకు, సామానులు భద్రప రిచేందుకు, పిల్లలు ఆడు కునేందుకు, విశ్రాంతి తీసుకు నేందుకు సరైన వసతి లేదు. మంచినీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యం లేని అంగన్‌వాడీ కేంద్రాలు కూడా 40 శాతం పైగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో 40 శాతం, పట్టణ కేంద్రాలలో 35 శాతం గిరిజన కేంద్రాలలో వంట సామాగ్రి కూడా ప్రభుత్వం సరఫరా చేయటంలేదు. ఉన్న పరిమితుల్లోనయినా అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలన్న చిత్తశుద్ధిని ప్రభుత్వాలు కనబరచకపోవడం సిగ్గుచేటు.
అంగన్‌వాడీ కేంద్రాల స్థితిగతులు ఇలా ఉంటే ఐసిడిఎస్‌ అమలులో కీలకమైన అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల స్థితిగతులు మరింత అధ్వానంగా మారుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రాజకీయ వేధింపులతో ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు, రిటైర్‌ అయిన వారికి పెన్షన్‌ వంటి సౌకర్యాలు లేవు. వారంతా ఉద్యమించిన ఫలితంగా వేతనాలు పెంచుతామని కేబినెట్‌ సబ్‌ కమిటీ చేసిన ప్రకటన నేటికీ అమలు కాలేదు. నెలల తరబడి జీతాలు, ఇంటి అద్దెలు చెల్లించకపోవటంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా ఉంటున్నది. వీటన్నింటితో సతమతమవుతున్న అంగన్‌వాడీల నెత్తి మీద ప్రైవేటీకరణ అనే పిడుగు వేయటానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఐసిడిఎస్‌ పరిరక్షణ, తమ హక్కుల సాధన కోసం అంగన్‌వాడీ ఉద్యోగులంతా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఐసిడిఎస్‌ను బలహీనపరచి అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తే పేదలు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే పెరిగిన ధరలు, తరిగిన ఉపాధితో ప్రజలు అల్లాడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టి కాహారం, ఇతర సేవలు ఆ కుటుంబాలకు కనీస స్థాయి లోనైనా భరోసాగా ఉన్నాయి. ఇక ముందు ఈ ఆసరా కూడా లేకుండా చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఐసి డిఎస్‌ పథకం ప్రారంభమై నలభై ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో ఆ వ్యవస్థను కాపాడుకోవడానికి, సుప్రీంకోర్టు ఆదేశిం చినట్టు సార్వత్రీకరణకూ లబ్ధిదారులు, అంగన్‌వాడీ ఉద్యో గులూ ఐక్యంగా ఉద్యమించాలి. అప్పుడే ప్రభుత్వ ప్రైవేటీకరణ కుట్రలను తిప్పిగొట్టడం సాధ్యమవుతుంది.
- పి.రోజా 
(ఐసిడిఎస్‌ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవ్యాసం)
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి)