Home » District » Visakapatnam 'ఆంత్రాక్స్‌' మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

 - వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక వైద్య శిబిరాలు
 - బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ 
 - సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌
 - పనసపుట్టు గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం
              హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యాన్ని పట్టి పీడిస్తున్న ఆంత్రాక్స్‌ మహ్మామారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నిపుణులైన డాక్టర్లతో 
ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం పాడేరు వచ్చిన ఆయన స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006 నుంచి ఆంత్రాక్స్‌ వ్యాధి విశాఖ మన్యాన్ని కుదుపేస్తుందని, గతంలో ముంచంగిపుట్టు మండలం కర్లపొదుర్‌లో ఈ వ్యాధి ప్రబలి అనేక మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. అరకులోయ మండలంలో కూడా ఈ వ్యాధి ప్రబలిందని, అప్పట్లో ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. గత నెలలో హుకుంపేట మండలం పనసపుట్టులోనూ, ఈ నెలలో జి.మాడుగుల మండలం వెన్నెలకోట, గొయ్యిగుంట గ్రామాల్లోనూ సుమారు 50 మంది గిరిజనులు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. 
కుటుంబ పెద్దలకు ఈ వ్యాధి ప్రబలడంతో ఆ కుటుంబాలు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంత్రాక్స్‌ బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని లోకనాథం డిమాండ్‌ చేశారు. మన్యంలో అధిక సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయని, వాటి నివారణకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పశుమాంసం తినకుండా గిరిజనులను చైతన్య పర్చాలని సూచించారు. మన్యంలో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వైద్య శిబిరాలు నిర్వహించకపోతే తమ పార్టీ తరుపున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అప్పలనర్స, పాలికి లక్కు, సుందరరావు తదితరులు పాల్గొన్నారు. 
పనసపుట్టు గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం
ఆంత్రాక్స్‌ వ్యాధితో బాధపడుతున్న పనసపుట్టు గ్రామవాసులను సిపిఎం బృందం మంగళవారం సాయంత్రం పరామర్శించింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాథం నేతృత్వంలో డివిజన్‌ నాయకులు పుణ్యారావు, పుణ్యవతి, ఆర్‌.శంకరరావు, కె.సుజాత, సుందరరావు, కొండలరావు తదితరులు గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఆంత్రాక్స్‌ వ్యాధి సోకడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన పశువులను తినడం వల్లే ఈ వ్యాధి సోకినట్లు గిరిజనులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటికి ఇబ్బంది ఉందని, తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.