CRDA కొత్త నిబంధనలు..

ప్రభుత్వ నిర్ణయాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సిఆర్‌డిఎ విధిస్తున్న నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సిఆర్‌డిఎ పరిధిలోని 58 మండలాల్లో అగ్రికల్చర్‌ ప్రొటక్షన్‌ జోన్‌ (గ్రీన్‌బెల్ట్‌)ను ఏర్పాటు చేసి ప్రస్తుతం గ్రామంలో ఇళ్లున్న ప్రాంతానికి 500 మీటర్లలోపు దూరంలోని లే అవుట్లకు మాత్రమే అనుమతి ఇస్తామని సిఆర్‌డిఎ చెబుతోంది. దీంతో గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో రైతుల పొలాలకు విలువ తగ్గిపోతోంది. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాధించుకుని అంతో ఇంతో తక్కువ ధరకు వచ్చే గ్రామానికి దూరంగా ఉండే స్థలాలను కొనుగోలు చేసి గృహాలు నిర్మించుకుంటారు. ప్రస్తుత నిబంధనలతో వీరు ఇళ్లు నిర్మించుకునే అవకాశం లేకుండాపోతోంది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను సింగపూర్‌, జపాన్‌, మలేషియా కంపెనీలకు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ఆయా కంపెనీల ప్రయోజనాలకు లాభం చేకూర్చేందుకేనని రియల్‌ వ్యాపారులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతులకు, చిన్న వ్యాపారులకు, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. రాజధాని అమరావతి మినహా ఇతర 58 మండలాల్లోనూ అభివృద్ధి జరగడానికి ఈ నిబంధనలు ఆటంకంగా మారాయి. 2050 సంవత్సరం వరకు మాస్టర్‌ ప్లాన్‌ ఇలాగే ఉంటే రైతులు, ప్రజలు వీధులపాలు కావాల్సి వస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లే అవుట్లకు అనుమతులు నిలిపివేయడంతో రియల్‌ వ్యాపారులు పెట్టుబడి వచ్చేమార్గంలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న రైతులు తమ కుమార్తె వివాహానికో, ఇతర అవసరాలకో భూమి అమ్ముకోవాలంటే సరైన మార్కెట్‌ ధర అందక నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సింగపూర్‌మాస్టర్‌ ప్లాన్‌ మార్చాలనే డిమాండ్‌ పెరుగుతోంది. అలాగే గ్రీన్‌బెల్ట్‌ను ఎత్తివేసి రైతులు తమ భూములను తమకు ఇష్టమైన రీతిలో వినియోగించుకునే హక్కు కల్పించాలని పలువురు కోరుతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌పై స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.