CRDA కార్యాలయానికి తాళాలు..

ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. సింపూర్‌, జపాన్ కంపెనీలకు భూములను తాకట్టు పెడుతోందని విమర్శించారు.ఉదయం తొమ్మిది గంటలకే వందలాదిగా కార్యాలయం వద్దకు చేరిన ప్రజలు అధికారులెవ్వరినీ లోనికి పోనివ్వకుండా ఐదుగంటల పాటు ముట్టడించారు. గ్రామ కంఠాలుగా అంబటి నగర్‌, శ్రీరామనగర్‌, శ్రీనగర్‌ కాలనీలు, ఎపిఐఐసిసి ఇండిస్టియల్‌ పార్కు, పంచాయతీ ఆనుకొని ఉన్న స్థలాన్ని భూసేకరణ ద్వారా తీసుకుంటున్నట్లు ప్రకటి ంచిన నేపథ్యంలో స్థానికులంతా అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. దీంతో డిఎస్‌పి ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున మొహరించారు. గ్రామకంఠాల జోలికి వెళ్లబోమని, నివాస ప్రాంతాల్లోని స్థలాల జోలికి పోబోమని క్రిడా డిప్యూటీ కలెక్టర్‌ లలిత హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.