CPMపై అక్కసుతో తప్పుడు రాతలా?

సీనియర్‌ పాత్రికేయులు, ప్రస్తుత బిజెపి అధికార ప్రతినిధి, ఎంపీ ఎంజె అక్బర్‌ ఆక్టోబరు 5న వృద్ధ నేతలు-వ్యర్థ సిద్దాంతాల పేరుతో సాక్షి దినపత్రికలో వ్యాసం రాశారు. సీనియర్‌ పాత్రికేయులుగా సమకాలీన రాజకీయాల్లో విశ్లేషణా త్మక విమర్శలు చేసి ఉంటే మంచిది. కానీ అందుకు విరుద్ధంగా తమ పార్టీ సహజ లక్షణాలు పుణికి పుచ్చుకుని కమ్యూనిజంపై ముఖ్యంగా మార్కిస్టు పార్టీపై కూడా విమర్శలకు దిగారు. ఆయన పేర్కొ న్నట్టుగా కాకుండా సిపిఎంకు వృద్ధనేతలు, వారి త్యాగాలు, ఆశయ సాధన, పోరాట పటిమే మార్గదర్శకాలు, ప్రస్తుత బిజెపికి సీనియర్‌ నేతలన్నా, వారి అభిప్రాయాలన్నా గౌరవం లేని పద్ధతుల్లో బలవంతపు రిటైర్‌మెంట్‌ ఇచ్చి రాజకీయ సమాధి చేయడం అలవాటు. దానికి ఉదాహరణ మన కళ్ల ముందు ఉన్న ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ లాంటి నేతలకు వారిస్తున్న ప్రాధాన్యతలు కనబడుతుంది. గుజరాత్‌లో అయితే ఈ సంఖ్య లెక్కకు మించి ఉంది. కుట్రలు, కుతంత్రాలతో, అసమ్మతి రాజకీయాలతో పక్క వారిని తొక్కిపట్టి అందలం ఎక్కడం ప్రస్తుతం బిజెపిలో కనప డుతున్న సత్యం. అందుకు ఉదాహరణ గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలు చూడవచ్చును. కేశూభారు పటేల్‌ నుంచి నరేంద్రమోడీ వరకు, కళ్యాణ్‌సింగ్‌ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ వరకు ఆయా రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తీరు వీటికి అద్దం పడుతుంది. అదే పద్ధతుల్లో మధ్యప్రదేశ్‌లో ఉమాభారతిని గద్దెదింపిన నేపథ్యం, కర్ణాటకలో ఎడ్యూరప్పను సాగనంపిన వైనం ఆ పార్టీ రాజకీయాలు కాంగ్రెసుకు ఏ మాత్రం తీసిపోని విధం గా, వ్యక్తుల స్వామ్యం, మతవాదుల ముద్ర కనబడుతుంది.
అదే వామపక్ష పాలిత రాష్ట్రాలైన బెంగాల్‌, త్రిపుర, కేరళలో ముఖ్యమంత్రులు వయస్సు రీత్యా పార్టీ ఆదేశాల మేరకు అధికారం నుంచి తప్పుకున్న తీరు, అధికార మార్పిడి జరిగిన తీరు భారతదేశం చూసింది. ఈ వ్యత్యాసం నక్కకు నాగలోకానికి ఉన్నట్లుంది. బెంగాల్‌ ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సిపిఎం సీనియర్‌ నేతల్లో ఒకరైన అసీమ్‌ దాస్‌ గుప్తాను సిపిఎం మేయర్‌ అభ్యర్థిగా బిదాన్నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయించడం ఏమిటని, అంతటి సీనియర్‌ నాయకుడు ఓటు అడిగే పద్ధతి మరీ పాత చింతకాయ పచ్చడిలా ఉందని ఎద్దేవా చేయడానికి ఆయన ప్రయత్నించారు. అయితే బెంగాల్‌లో నేడు జరుగుతున్న హింస, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్య పరుస్తున్నారనే విషయం రచయితకు కనబడలేదు. ఓ సీనియర్‌ నేత మేయర్‌గా పోటీ చేయడం ఏమిటని ఆయన వ్యాసంలో వ్యక్తమైంది. వయస్సుతో నిమిత్తం లేకుండా గెలుపోటములు పక్కన పెట్టి పార్టీ ఆదే శాలతో ఎన్నికల రంగంలోకి దూకడం, మార్కిస్టు పార్టీ కార్య కర్తలుగా బాధ్యలను అమలు చేయడం క్రమశిక్షణ గల కార్య కర్తల విధి. దాన్నే అమలు చేస్తున్నారు అసీమ్‌ దాస్‌గుప్తా. బెంగాల్‌లో జరుగుతున్న హింసపై కూడా అక్బర్‌ సిపిఎంపై నిందాపూర్వక వ్యాఖ్యలు, అవాస్తవాలు మాట్లాడు తున్నారు. బెంగాల్‌లో బిజెపి నాయకులు అక్కడి ప్రభు త్వంపై, దాని పాలనపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలను అక్బర్‌ అబద్ధమని ఒప్పుకోవాలి.
ఎందుకంటే సిపిఎం కంటే ఎక్కువగా మమతా బెనర్జీ ఆటవిక పాలనపైనా, దౌర్జాన్యా లపైనా, శారదా చిట్స్‌ కుంభకోణం లాంటి అవినీతిపైనా, మహిళలపై జరుగుతున్న దాడులపై బిజెపి నాయకులు ధ్వజ మెత్తుతూ ఆందోళన బాట పట్టారు. సిపిఎం కేంద్రీకృత ప్రజా స్వామ్యంతో పనిచేస్తుంది. దాన్ని అమలు చేయడం పార్టీ కార్య కర్తలుగా అందరి బాధ్యత. దానినే అమలు చేస్తున్నారు నేటి కార్యకర్తలు. కానీ అధికారంలోకి రావడానికి బిజెపి చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. యుపిఎ అసమర్థ, అవినీతి పాలనపై ప్రజాతిరుగు బాటుతో అధికారాన్ని అందుకున్న బిజెపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో మాత్రం తేలిపోయింది. అంతేకా కుండా అధికారంలో లేనప్పుడు ఒకమాట, వచ్చిన తర్వాత ఒకమాట మాట్లాడడం ఆ పార్టీకే చెల్లుతుంది.
స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు బిజెపి విదేశీ జపం చేస్తున్నది. దేశంలోని అపార సహజ సంపద, మానవ వనరులను విదేశీ శక్తుల కాళ్ల దగ్గర పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలోని కార్మిక శక్తిని, మేధో సంపత్తిని విదేశీయుల మెప్పు కోసం పణంగా పెడుతోంది. శ్రమయేవ జయతే అంటూ దేశ కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడుస్తోంది బిజెపి. దాని ఫలితమే గత సెప్టెంబరు 2న సమ్మె విజయవంతం అయిన నేపథ్యం. తాను అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని దోచిపెడుతోంది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో శతకోటీ శ్వరుల సంఖ్య మూడంకెలకు చేరి రంకెలు వేస్తున్న సంగతిని చూస్తున్నాం. పేదవాడిని మరింత కటిక దారిద్య్రంలోకి జారుస్తున్నాయి మోడీ సర్కారు విధానాలు. అవినీతి, నల్లధనం, ఉపాధిపై ఎన్నికల్లో వీరావేశంతో ప్రసంగం చేసిన మోడీ బృందం గడచిన 16 నెలల కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం తెస్తామని, అందరికీ పంచుతామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామని మాట మారుస్తున్న సంగతి చూస్తున్నాం. యుపిఎ ప్రభుత్వ అవినీతి పునాదులపై అధికారంలోకి వచ్చిన బిజెపి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి అవినీతికి గేట్లు తెరిచింది. దాని పర్యవసానమే లలిత్‌ మోడీ వివాదం, వ్యాపం కుంభకోణం లాంటివి. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో నియంతృత్వంతో కూడిన మతమౌఢ్యం విస్తృతం అవుతోంది. కాషాయ దళం ఆగడాలు పెరిగిపోతు న్నాయి. ఏదో ఒక సంఘటనతో మైనారిటీ ప్రజలపై దాడులు చేస్తోంది. మత ఘర్షణలు ప్రేరేపిస్తూ తాజాగా పశుమాంసం తిన్నాడని ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి గ్రామంలో వ్యక్తిని చంపిన ఘటన చూశాం. ఇష్టంలేని వారు తినకుంటే మంచిది. కానీ ఇతరులు తినకూడదు అనే ఆంక్షలు పెట్టడం ఏమిటి? ఎవరు ఏం తినాలో, ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆదేశించే హక్కు బిజెపికి ఎక్కడిది? దేశంలో ఆకలి, నిరుద్యోగం, రైతు ఆత్మహ త్యలు, మహిళలపై దాడులు వంటి సమస్యలు దేశాన్ని పీడి స్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం మత ఘర్షణలు రెచ్చగొట్ట డానికి ప్రాధాన్యత ఇస్తున్నది. తమ అసమర్థ పాలన దాచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. అందంగా అబద్ధాలు చెబుతూ, ఆకర్షణీయంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
ఇంతవరకు ఒక్క భారీ పెట్టుబడిని కూడా సాధించలేక పోయారు. మోడీ మాటలు కోటలు దాటుతు న్నాయి. కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు. తాను భ్రమల్లో ఉండి ప్రజలను భ్రమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తోంది బిజెపి సర్కారు. సరిగ్గా అలాంటి ఆలోచనలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా అక్బర్‌ వ్యాసం ఉంది. సిపిఎం పాలసీ సోవియట్‌ పొలిట్‌బ్యూరో మనస్తత్వం అంటూ అబద్ధాలు ప్రచారం చేయ డానికి ప్రయత్నించారు. సిపిఎం కింది నుంచి ప్రజాస్వామ్య పద్దతుల్లో ఉంటుంది. వ్యక్తిస్వామ్యం ఉండదు. వ్యక్తిస్వామ్యం బిజెపిలో ఈ మధ్య ఎక్కువైంది. సిపిఎం కూడా అలాగే ఉంటుందని అక్బర్‌ భ్రమపడి ఉంటారు. బెంగాల్‌ కూలిన కోటగా, స్వయంకృతాపరాధంతో ఓడినట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో గెలుపోటములు సహజం. దాన్ని సిపిఎం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కొం టుంది. 70వ దశకంలో కూడా బెంగాల్‌లో ఇటువంటి పరిణా మాలే కాంగ్రెసు కలిగించింది. అయితే మొక్కవోని దీక్షతో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నారు. అదే నేటి బెంగాల్‌లో ఉన్న కామ్రేడ్‌ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో ద్వంద్వ ప్రమా ణాలు లేని, అవకాశవాదానికి ఆమడ దూరంలో ఉన్న పార్టీగా ప్రజల్లో పేరుగాంచింది. 
- బి వీరశేఖర్‌ 
(వ్యాసకర్త సిపిఎం కర్నూల్‌ జిల్లా  పత్తికొండ డివిజన్‌ కార్యదర్శి)