
న్యూఢిల్లీ: పార్టీ నిర్మాణ నివేదికపై అఖిలభారత విస్తృతస్థాయీ సమావేశం (ప్లీనం) డిసెంబరులో కొల్‌కతాలో నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిర్ణయించింది. కోల్‌కతాలో ఈ తరహా ప్లీనం నిర్వహించడం 37 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. పార్టీ నిర్మాణ బలం, బలహీనతలను మదింపు వేసేందుకు జరిగే ఈ ప్లీనం ఏర్పాట్లపై ఆదివారం నాడిక్కడ ముగిసిన మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాలలో విస్తృతంగా చర్చించారు. ప్లీనమ్‌కు సన్నాహక చర్యగా పార్టీ రాష్ట్ర కమిటీలు అందించిన నివేదికలు, నిర్దిష్ట సమస్యలు, వాటి పరిష్కార మార్గాల ఆధారంగా పార్టీ పొలిట్‌బ్యూరో ఒక ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తోందని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ 21వ అఖిలభారత మహాసభలను విశాఖపట్నంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో చివరిసారిగా 1978లో పశ్చిమబెంగాల్‌లోని సాల్కియాలో పార్టీ ప్లీనంను నిర్వహించారు.