332 మండలాల్లో లోటు

 

 

-  60% పైన వర్షపాతంతగ్గిన మండలాలు-72
-  'నెల్లూరు', రాయలసీమలో భారీగా తగ్గుదల 
-  65 శాతం విస్తీర్ణంలోనే సాగు 
-  ప.గో.జిల్లాలోనూ ఎండుతున్న నారుమళ్లు
-  వెద పద్ధతిలో వరి వేయాలని సూచనలు
-  కడపలో వట్టిపోతున్న బోర్లు 
మఫిషియల్‌ డెస్క్‌

           ఖరీఫ్‌ సాగులో కీలకమైన నెల జూలై. ఆ నెలలో వర్షాలు కురిస్తే అన్ని పైర్లకూ మేలు జరుగుతుంది. పంటల భవితవ్యం తేల్చేది కూడా ఆ నెలే. అయితే ఇది వర్షాభావంతో ముగిసింది. రాష్ట్రంలో జులైలో సగటున 247.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 227.5 మిల్లీమీటర్లే పడింది. మొత్తంగా 8.3 శాతం వర్షపాతం తగ్గింది. రాష్ట్రంలో కేవలం 138 మండలాల్లో మాత్రమే 19 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. మరో 200 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 260 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ లోటు వర్షపాతం నమోదైంది. 72 మండలాల్లో 60 శాతం పైన లోటు వర్షపాతం నమోదైంది. జులైలో విశాఖపట్నం, తూర్పుగోదావరిలోనే సాధారణ వర్షపాతం కన్నా అదనంగా నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో - 19 శాతం నుంచి + 19 శాతం వరకూ సాధారణ వర్షపాతం నమోదైంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గత 29కి రాష్ట్రంలో 19.81 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావాలి. 12.87 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. అంటే 65 శాతమే సాగయినట్లు తేలుతోంది. 
అనంతపురం జిల్లాలో కరువు తాండవం చేస్తోంది. పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. వేరుశనగ విత్తేందుకు అదును దాటిపోవడంతో రైతులు విత్తనాలను అమ్మకానికి పెడుతున్నారు. వారి ఇబ్బందిని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులకు విత్తనానికి పెట్టిన డబ్బు కూడా రావడం లేదు. మిగిలిన సీమ జిల్లాల్లోనూ కరువు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో బోరు బావులను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులు నట్టేట మునుగుతున్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటల రక్షణకు భగీరథయత్నం చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు పనుల కోసం వలస పోతున్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ సాగు ముందుకు సాగడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో అరకొర వర్షాలతో సాగు సగానికి తగ్గిపోయింది. నారుమళ్లు ఎండిపోతున్నాయి. గతేడాది వరి సాగు సాధారణ విస్తీర్ణం స్వల్పంగా పెరిగింది. ఈ యేడు మాత్రం భారీగా తగ్గిపోయింది. మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, చెరకు అన్నింటి సాగు గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. వర్షాభావాన్ని అధిగమించడానికి ఆయిల్‌ ఇంజన్లతో సాగు చేపట్టేందుకు రైతులు యోచిస్తున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 27 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. ఫలితంగా 1.19 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి కేవలం 9,339 హెక్టార్లకే పరిమితమైంది. తాటిపూడి, తోటపల్లి ప్రాజెక్టుల నీరే ప్రధాన వనరు. తాడిపూడి నుంచి 120, తోటపల్లి నుంచి 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 'ఆండ్ర' నుంచి నీరు విడుదల కాలేదు. పశ్చిమ గోదావరి వంటి జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో ఊహించొచ్చు. నాట్లు 45 శాతమే పూర్తయ్యాయి. జిల్లాలో 20 వేల హెక్టార్లకు ప్రకాశం బ్యారేజీ నుంచి ఏలూరు కాల్వ ద్వారా సాగుకు నీరు అందాలి. ఎగువ జలాశయాల్లో నీరు లేనందువల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వచ్చే ఈ కాలువ కింద సాగు లేకుండా పోయింది. నీళ్లొస్తాయనే ఆశతో నారుమళ్లు పోశారు. కాలువ నుంచి నీరు రాకపోవడం, వర్షాభావం కారణంగా నారుమళ్లు ఎండిపోతున్నాయి. కృష్ణాలో సాగు పూర్తి స్థాయిలో జరగలేదు. గుంటూరు జిల్లాలో కాలువలకు సాగునీరు రాదని తేలడంతో వెదజల్లే పద్ధతిలో వరిని వేయిస్తున్నారు.