25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు

 25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్‌ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించటంతోపాటు ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వామపక్షాలపై ఉందన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె), ప్రజాశక్తి బుకహేౌస్‌ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.