2.45కోట్ల ఆహారధాన్యాలు వృథా

ఈ ఏడాది జూన్‌ వరకు భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రు.2.45కోట్ల విలువ చేసే ఆహార ధాన్యాలు పాడైపోయాయని, క్రమశిక్షణా చర్య తీసుకున్నామని కేంద్ర ఆహారమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఆహారధాన్యాలను శాస్త్రీయమైన పద్ధతుల్లో నిల్వ చేస్తారు. జులై ఒకటవ తేది నాటికి 54.5 మిలియన్‌ టన్నుల గోధుమలు, బియ్యంను ఇక్కడ నిల్వ చేసినట్లు తెలిపారు. అత్యంత పకడ్బందీగా సశాస్త్రీయమైన పద్ధతుల్లో నిల్వ చేసినప్పటికీ కొంతమేరకు ఆహారధాన్యాలు పాడైపోవచ్చని, చీడపురుగులు పట్టడం, గిడ్డంగుల్లో లీకేజీలు, నాణ్యతలేని సరుకును సేకరించడం, వర్షాలకు తడిసిపోవడం వంటివి ఇందుకు కారణాలని అన్నారు. రాజ్యసభలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. మరోవైపు సంబంధిత వ్యక్తులు చూపే నిర్లక్ష్యం కూడా కారణం కావచ్చునని అన్నారు. అటువంటి నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరించిన వారిపట్ల క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది జూన్‌ వరకు ఇందుకు సంబంధించి 13మంది ఎఫ్‌సిఐ అధికారులపై, 77మంది అధికారులపై చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు.