2జి స్కాంలో కొత్త కోణం..

 2జి స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి న ముడుపుల సొమ్ము సూరత్ మీదు గా స్విట్జర్లాండ్ వంటి పన్నులకు స్వర్గ్ధామైన దేశాలకు తరలిపోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తులో వెల్లడయింది. ఈ నిధులను ఆపరేటర్లు చెన్నై నుంచి సూరత్ మీదుగా స్విట్జర్లాండ్ వంటి దేశాలకు తరలించినట్లు రూ. 5,395 కోట్ల విలువ గల హవాలా కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఇడి పరిశోధనలో తేలింది. అహ్మదాబాద్ జోనల్ యూనిట్ ఇడి అధికారులు ఈ నెల ఒకటో తేదీన కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంతో సంబంధం ఉన్న దుబాయికి చెందిన వ్యాపారవేత్త మనీశ్ షాను సూరత్‌లో అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షా అరెస్టుతో 2జి స్పెక్ట్రం కుంభకోణం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలిపోయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని ఇడి వర్గాలు తెలిపాయి. 2జి స్కాం సొమ్ము చెన్నై నుంచి సూరత్ మీదుగా దుబాయి, హాంకాంగ్‌లకు తరలిపోయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ ముడుపుల సొమ్ము చెన్నై నుంచి సూరత్ మీదుగా పన్నులకు స్వర్గ్ధామంలా పేరు పొందిన స్విట్జర్లాండ్ వంటి దేశాలకు కూడా అక్రమంగా తరలిపోయినట్లు ధ్రువీకరించే కీలకమైన సాక్ష్యాలు ఇప్పుడు ఇడికి లభించాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇడి వర్గాల కథనం ప్రకారం.. షాకు దుబాయిలో ‘మబ్‌రూక్ ట్రేడింగ్’ అనే సంస్థ ఉంది.
కీలక నిందితులయిన అఫ్రోజ్ ఫట్టా, మదన్‌లాల్ జైన్‌ల నుంచి వేర్వేరు హవాలా మార్గాల ద్వారా రూ. 700 కోట్లకు పైగా సొమ్ము ‘మబ్‌రూక్ ట్రేడింగ్’ సంస్థకు చేరింది. హవాలా రాకెట్‌ను నడుపుతున్న కేసులో నిందితులయిన అఫ్రోజ్ ఫట్టా, మదన్‌లాల్ జైన్‌లను తరువాత ఇడి అరెస్టు చేసింది. 2013 డిసెంబర్ నుంచి 2014 జనవరి వరకు కేవలం రెండు నెలల వ్యవధిలో సుమారు రూ. పది వేల కోట్లు భారత్ నుంచి తరలిపోయి ఉంటాయని షాకు సంబంధించిన ఈ తాజా కేసులో తెలిసిందని ఇడి వర్గాలు పేర్కొన్నాయి.