11న సీతారాం ఏచూరి గుంటూరు రాక

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు. అలాగే పెట్టుబడి గ్రంధం ప్రాముఖ్యత అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ ప్రసంగిస్తారని రామారావు తెలిపారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు,సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు. 1917లో రష్యాలో మొదటి సారిగా కార్మిక వర్గ విప్లవం జయప్రదం అయి సోషలిస్టు వ్యవస్థ అధికారంలోకి వచ్చిందని పెట్టుబడి దారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదనే ప్రచారం వమ్ము చేశారన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ అనేక దేశాల్లో విప్లవాలకు స్పూర్తిదాయకంగా నిలిచిందని ఆ విప్లవం ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిందన్నారు. అలాంటి విప్లవ శత వార్షికోత్సవ సభ అనేక అభ్యుదయ,వామపక్ష ఉద్యమాలకు కేంద్రం అయిన గుంటూరులో నిర్వహించడం అవసరం అన్నారు. ప్రపంచంలో ఉన్న పెట్టుబడి దారి వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. పెట్టుబడి దారి దేశాలలో నిరుద్యోగం,నిరక్షరాస్యత పెరగడమే కాకుండా ఆర్ధిక సంక్షోభంలో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈస్థితిలో కేపిటల్‌ గ్రంధాన్ని అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, అసంఘటిత రంగ కార్మికులపై తీవ్రంగా భారాలు పడుతున్నాయని వీటికి పరిష్కారం సోషలిస్టు వ్యవస్థలోనే ఉందన్నారు. ఈ సంవత్సరానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. కారల్‌ మార్క్సు జన్మించి 200, ఆయన రాసిన పెట్టుబడి గ్రంధం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పెట్టుబడి కార్మిక వర్గ విప్లవాలకు దిక్చూచిగా ఉందన్నారు. ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని నిర్వహించే సదస్సులో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.