‘లాజిస్టిక్‌ హబ్‌’ భూ సాగుదార్లకు నష్టపరిహారం పెంచాలి. కూలీలకు, వృత్తిదార్లకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి.- సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు సాగుదార్లను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్‌ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, వల్లూరు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును సేకరిస్తున్నారు. 
    ‘‘లాజిస్టిక్‌ హబ్‌’’ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటివరకు ప్రకటించిన పరిహారం చట్టబద్దమైంది కాదు. దీనిని పెంచాలి. నిర్వాసితులు, ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీలు, ఇతర వృత్తిదార్లకు, యువకులకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి.  వీటన్నింటిపై ఒక స్పష్టమైన, వ్రాతపూర్వక అగ్రిమెంట్‌ వచ్చే వరకు భూసేకరణ చర్యలు నిలుపుదల చేయాలని లాజిస్టిక్‌ హాబ్‌ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.
    చట్ట ప్రకారం నష్టపరిహారం కోసం 8 గ్రామాల ప్రజలకు ఒకే రకమైన పరిహారం, ఒకే సారి కాకుండా సర్వే నెంబర్లు వారీగా  విడి విడిగా చర్చలు జరుపుతున్నారు. ఇది సరైందికాదు.  అలాగే ఇదే భూముల్లో కూలీ, నాలీ చేసుకుంటున్నవారికి, కల్లుగీత, ఇతర వృత్తిదార్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ వచ్చే కంపెనీలో ఉద్యోగాలు, ఇతర వసతుల గురించి అధికార్లు గానీ, ప్రజాప్రతినిధుగాని కనీసం మాట్లాడడం లేదు. 
    ఇటువంటి పరిస్థితుల్లో భూములు కోల్పోతున్న సాగుదార్లు, ఎటువంటి ఆధారం లేని కూలీలు, వృత్తిదార్లు, యువకులను ఆదుకోవల్సింది ప్రభుత్వమే.  చట్టప్రకారం వీరికి ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి. వీటిపై వ్రాతపూర్వక హామీ ఇవ్వాని పోరాడుతున్నాం. 
        పై సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఉపాధి, ఇతర ప్యాకేజీలపై వ్రాతపూర్వక హామీ ఇచ్చిన తరువాతనే భూసేకరణపై ముందుకు వెళ్లాని కోరుతున్నాం.

    ఈ విషయమై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నివాస్‌ గారికి వినతిపత్రం సమర్పించడమైనది. సాగుదార్లుకు పరిహారం పెంపుకు పరిశీలిస్తున్నామని, కూలీలకు, వృత్తిదారులకు ఉపాధి, ప్యాకేజీ విషయమై రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేస్తామన్నారు.  నిరుద్యోగ యువత సర్వే నిర్వహిస్తామని భూముల కొలతల్లో వచ్చిన తప్పిదాలను రిసర్వే చేస్తామన్నారు.