
కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ర్టాల జుట్లు ముడేసింది. రాష్ర్టాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన కేంద్రం.... తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ‘ట్యాపింగ్’ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిందిపోయి... సర్వీస్ ప్రొవైడర్లను వెనుకేసుకొచ్చే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య మరింత పెరిగేలా లేఖలు రాసింది. ‘మేం ట్యాపింగ్ చేయలేదు!’ అని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తుండగా... ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో... ‘ప్రభుత్వాలు సంయమనంతో చట్టాలకు లోబడి వ్యవహరించాలి’ అని సూచిస్తూ తెలంగాణకు మరో లేఖ పంపింది ఈ వింత వైఖరిపై ఇరు రాష్ట్రాల అధికారులూ విస్తుపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుసహా అనేక మంది ప్రముఖుల సెల్‌ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఏపీలో అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆధారాలను ఏపీ సర్కారు సేకరించి... కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖకు, హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఎవరి ఆదేశాల మేరకు తమ ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలంటూ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు... ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తాము రాసిన లేఖలనుకానీ, కాల్‌డేటా కానీ ఎవ్వరికీ ఇవ్వొద్దని తెలంగాణ సర్కార్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించినట్లు.. కాదని వివరాలు బయటపెడితే ప్రాసిక్యూట్ చేస్తామని కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు కేంద్రం శరణుజొచ్చారు. ‘‘ఒక రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అడుగుతోంది. వివరాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని మరో ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మీరే రక్షించాలి’’ అని టెలికాం శాఖను కోరింది. దీంతో... టెలికం శాఖ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా తగిన సూచనలతో ఒక లేఖ రాసింది. ‘‘ఇంటర్‌సెప్ట్ (ట్యాపింగ్) డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద లేదు. అది (తెలంగాణ) నిఘావర్గాల వద్ద మాత్రమే ఉంది’’ అని ఈ లేఖలో తెలిపింది. వెరసి... ఇరు ప్రభుత్వాలు, సర్వీస్ ప్రొవైడర్లకు రాసిన లేఖల్లో ‘ట్యాపింగ్’ నిజమే అని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించినట్లయింది. కేంద్రం ఏపీకి, తమకు పంపిన లేఖల ఆధారంగా సర్వీసు ప్రొవైడర్లు శుక్రవారం విజయవాడ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టుకు తాము కాల్ డేటా రికార్డులు ఇవ్వక్కర్లేదన్నారు. అయితే, కేంద్రం పరిపాలనా ప్రక్రియలో భాగంగానే మెమో పంపిందని... దీనికి కోర్టులతో సంబంధం లేదని ఏపీ వాదించింది. పాలనా వ్యవహారాలు వేరు, కోర్టులు వేరని తెలిపింది. ఈ వాదనలతో కోర్టు కూడా ఏకీభవించింది. రికార్డులు ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించింది. మొత్తానికి... సర్వీస్ ప్రొవైడర్లు ఈ వ్యవహారాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకోకుండా కేంద్రాన్ని ఆశ్రయించడంతో వ్యవహారం బెడిసికొట్టింది. కేసులతో సంబంధం లేని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనడం వివాదాస్పదంగా మారగా... తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ‘చర్యలు’ తీసుకున్నారంటూ పరోక్షంగా ‘ట్యాపింగ్’ను కేంద్రం ధ్రువీకరించడం గమనార్హం.