హోదా సాధించకపోతేప్రతిఘటనే

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్‌ సెంటర్లో మంగళవారం మాక్‌ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కనీసం గంట సేపయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై చర్చించి సాధించాలన్నారు. ప్రత్యేక హోదా తమవల్లే సాధ్యమైందని ప్రస్తుత బిజెపి మంత్రి వెంకయ్య నాయుడు అప్పట్లో గొప్పలు చెప్పుకుని సన్మానాలు సైతం చేయించుకున్నారన్నారు. ప్రత్యేక హోదా ప్రకటనతో కాకుండా రాష్ట్రానికి వస్తే... ఆగస్ట్‌ 14 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి ఆయా మంత్రులు, ఎంపీలను రోడ్డుపై తిరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు.