హిందూత్వ వెనుక కుల వైరస్‌

హిందూ జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? ప్రధానికి సంబంధించినంత వరకు ఇది నిరర్థకమైన ప్రశ్న కాదు. మరో కారణం రీత్యా ఇదొక నిరర్థకమైన ప్రశ్న. రాజ్యాగాన్ని అనుసరించి భారతదేశం ఎన్నటికీ హిందూ దేశం కాబోదు. ఒక జాతి రాజ్యంగా ఇది రాజకీయంగా మతంతో ఎలాంటి సంబంధంలేనిదిగా ఉండి తీరాలి. ఇదే ప్రశ్నను మరో రకంగా కూడా చెప్పవచ్చు. లౌకికవాద ''భారతీయ'' జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? గీతా ప్రెస్‌ ప్రచురణలననుసరించి గట్టిగా 'కాదు' అనే వస్తుంది. వారి సిద్ధాంతం హిందూ జాతీయవాదం. వారి లక్ష్యం హిందూ భారతదేశం. ప్రస్తుతం కేంద్రంలో వారి సైద్ధాంతిక అనుబంధ సంస్థలే అధికారంలో ఉన్నందునా, రాజ్యాంగపరమైన వాస్తవాన్ని వారు తిరస్కరిస్తున్నందునా ఈ ప్రశ్నకు వారిచ్చిన సమాధానంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
హిందూత్వ పరిశీలన
హిందూత్వను కూలంకషంగా పరిశీలించడం అక్షయ ముకుల్‌ రాసిన కొత్త పుస్తకం ''గీతా ప్రెస్‌ అండ్‌ మేకింగ్‌ ఆఫ్‌ హిందూ ఇండియా'' సాధించిన అనేక విజయాల్లో అత్యంత ముఖ్యమైనది. దాని చోదకశక్తి రూపకల్పన, అది నడిచే ఇంధనం, దాని కదలికను నియంత్రించే లివర్లు వంటి వాటన్నింటినీ పరిశీలించింది. ఈ పరిశీలనకు ప్రారంభం గీతా ప్రెస్సే. ఇది దేశంలోకెల్లా అత్యంత పురాతనమైనది. సంఘ పరివార్‌కు సంబంధించిన వివిధ సంస్థలతో సుదీర్ఘకాలంగా సంబంధాలు కలిగి ఉన్నది. హిందూవాదానికి సంబంధించిన పుస్తకాలను విక్రయించడంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. గీతా ప్రెస్‌, అది ప్రచురించే మాసపత్రిక కల్యాణ్‌ 1920 మధ్యలో స్థాపించబడ్డాయి. 2014 ప్రారంభం నాటికి గీతా ప్రెస్‌ 7,20,00,000 భగవద్గీత కాపీలను, ఏడు కోట్ల తులసీదాస్‌ రామచరితమానస్‌ కాపీలను, ఇంకా ఇతర రచనలను అమ్మింది. ''ఆదర్శప్రాయమైన హిందూ'' మహిళ, బిడ్డ ఎలా ఉండాలనే అంశంపై సాగిన రచనల కాపీలను 9,48,00,000 విక్రయించింది. ఈనాటికీ, కల్యాణ్‌ సర్క్యులేషన్‌ రెండు లక్షల పైమాటే. ఈ పత్రిక ఆంగ్ల ప్రతి కల్యాణ-కల్పతరు సర్క్యులేషన్‌ లక్ష పైమాటే. దీని దీర్ఘకాలిక మనుగడ, విజయ రహస్యం ఏమిటి? ఈ ఘనతలో ఎక్కువ భాగం దీని వ్యవస్థాపకులకే దక్కుతుంది. వారే గీతా ప్రెస్‌ యజమాని జైదయాళ్‌ గోయంద్కా, 40 ఏళ్ళకు పైగా కల్యాణ్‌ మేగజైన్‌ సంపాదకుడుగా ఉన్న హనుమాన్‌ ప్రసాద్‌ పోద్దార్‌. ''ఆథ్యాత్మికవాదులుగా మారిన మార్వాడీ వ్యాపారవేత్తలు''గా వారిని ఆ పుస్తకం అభివర్ణించింది. ఇక్కడ ప్రముఖంగా నిలిచేది ఈ సంస్థకు సంబంధించిన కులం కోణం. మార్వాడీల పెట్టుబడితో గీతా ప్రెస్‌ను, కల్యాణ్‌ను స్థాపించారు. కల్యాణ్‌ పత్రికకు సుదీర్ఘకాలంగా సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్న పోద్దార్‌ ఎక్కువగా బ్రాహ్మణ రచయితలు, సంపాదకులు, కళాకారులతో పనిచేశారు. గీతా ప్రెస్‌ చరిత్రను విశ్లేషించాలంటే దాల్మియాలు, ద్వివేదీలు, గోయంకాలు, గుప్తాలు, బిర్లాలు, జైనులు, చతుర్వేదీలు, ముఖర్జీల గురించి వివరించాల్సి ఉంటుంది. బనియాలు, బ్రాహ్మణుల కలయిక యాదృచ్ఛికమేమీ కాదు. హిందూ దేశం అనేది అవసరమైన ప్రాజెక్టుగా ఎందుకు కావాలనుకున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది.
19వ శతాబ్దం చివర్లో-20వ శతాబ్దం నుంచి మార్వాడీలు భారత పెట్టుబడిదారీ విధానంపై ఆధిపత్యం చెలాయించసాగారు. ఇది ''రెండు పరస్పర విరుద్ధమైన అంశాలకు'' దారి తీసిందని ముకుల్‌ తన పుస్తకంలో వివరించారు. ఒకటి, మార్వాడీలు ఇతరులు అసూయ పడేంతగా శక్తివంతులుగా మారినప్పటికీ వైశ్యులుగా సామాజిక హోదాను అనుభవించలేకపోయారు. పేద బ్రాహ్మణులు, క్షత్రియులు వారి కంటే ఉన్నతులుగా నిలిచారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో భూస్వాముల ప్రాభవం క్షీణించడంతో మార్వాడీలు కీలక స్థాయికి వచ్చారు. ఈ క్రమాన్ని ఇండాలజిస్ట్‌ ఫిలిప్‌ లుగెండార్ఫ్‌ ''సెమీ-ఇన్‌వాలంటరీ అప్‌వర్డ్‌ మొబిలిటీ'' (పూర్తి స్థాయిలో లేని, స్వచ్ఛంద చైతన్యం దిశగా)గా అభివర్ణించారని ముకుల్‌ పేర్కొన్నారు. బనియాలు నూతన క్షత్రియులుగా మారారు. ఆలయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం, రామచరితమానస్‌ పారాయణాలకు స్పాన్సర్‌ చేయడం, గో సంరక్షణ సంఘాలకు నిధులివ్వడం వంటి కార్యకలాపాల ద్వారా సమాజంలో ఒక హోదాను పొందడం ద్వారా తమ గుర్తింపు సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని మార్వాడీలు భావించారు.
తొలుత మార్వాడీ కులాన్ని సంస్కరించే లక్ష్యంతో ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పత్రికలు నెలకొల్పాలని, తద్వారా హిందూ ధర్మాన్ని పెంచి పోషించాలని భావించారు. అందులో భాగంగా అనేక పత్రికలతో పాటు గీతా ప్రెస్‌ను, కల్యాణ్‌ను స్థాపించారు. ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా మార్వాడీలు మత పోషకులుగా 'జమిందారీ, సంపన్న భూస్వాముల' స్థానాన్ని ఆక్రమించారని, హిందూ సమాజంలోని క్షత్రియ-బ్రాహ్మణ పార్శ్వాన్ని వైశ్య-బ్రాహ్మణ పార్శ్వంగా మార్చారని ముకుల్‌ పేర్కొన్నారు. ఫలితంగా హిందూవాదం మార్వాడీకరణవాదంగా పరిణమించింది. మిలిటెంట్‌ హిందూవాదం మార్వాడీ పెట్టుబడులతో ఎదిగిందనడానికి ఈ గ్రంథం అనేక ఆధారాలను అందించింది. చివరకు గీతా ప్రెస్‌, కల్యాణ్‌ కూడా ఈ హిందూవాదాన్ని పెంచి పోషించాయని ముకుల్‌ పేర్కొన్నారు. ఇది, ముఖ్యంగా ''భక్తి నుంచి బనియా తరహా లబ్ధి''గా మారింది. దీన్ని బ్రాహ్మణ అధికారులు కూడా సమర్థించారు. గీతా ప్రెస్‌ యాజమాన్య హక్కులను కలిగిన ట్రస్టు గోవింద్‌ భవన్‌ కార్యాలయ సభ్యత్వం ఒక ఉదాహరణ. ఈ కార్యాలయంలోకి ఏ సనాతన ధర్మాన్ని పాటించే హిందువైనా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ప్రవేశించడానికి ద్వారాలు తెరిచే ఉంటాయి. కానీ శూద్రులు, అస్పృశ్యులు, ఆదివాసీలు లేదా ద్విజేతరులెవరూ ప్రవేశార్హులు కాదు. ఆసక్తికరమైన అంశమేమంటే, గీతా ప్రెస్‌ రాజస్థాన్‌లో ఒక వైదిక పాఠశాలను నిర్వహిస్తోంది. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల పిల్లలను మాత్రమే చేర్చుకుంటారు.
హిందూత్వ కుల బలం
హిందువుల హోదా రక్షకునిగా హిందూత్వ ముందుకొచ్చింది. అయితే, ఈ హోదా ఒక విషపూరితమైన మూలం నుంచి వచ్చింది. అదే హిందూవాదానికి గుండెకాయ వంటి వర్ణవ్యవస్థను కలిగి ఉన్న సనాతన ధర్మం తిరోగమన క్రమం. గత తొమ్మిది దశాబ్దాలుగా గీతా ప్రెస్‌ అందించిన భావజాలం చూస్తే హిందూత్వ అసలు లక్ష్యం ఒబిసిలను-దళిత మెజారిటీని బలహీనపరచడమే. మొత్తం జనాభాలో హిందువులు 80 శాతం ఉన్నారనే జనాభా గణాంకాలపై సంఘ పరివార్‌ ఏ కారణం లేకుండానే హేతువిరుద్ధమైన ఆందోళన కనబరుస్తోంది. అయితే ఇందులో అంతా హేతువిరుద్ధం కాదు, ద్విజ హిందువులు నిజంగానే మైనారిటీలు. ఒకవేళ మనం శూద్రులు, దళితులు, ఆదివాసీలు, వివిధ మత మైనారిటీలను కూడా కలుపుకుంటే వారు కూడా మైనారిటీలే. భారత రాజ్యాంగబద్ధ లౌకికవాదం పరిరక్షించబడాలని కోరుకునే వారిని మినహాయిస్తే ఇదంతా ఎక్కడకు వెళ్తోందో ఇటీవలి చరిత్రను అవలోకిస్తే ఒక ఆధారం దొరుకుతుంది. మొదటగా, 1990లో రిజర్వేషన్‌ వ్యతిరేక నిరసనలు, ఆందోళనలు కుల ఘర్షణలను జాతీయ రాజకీయాల తెరపైకి తెచ్చాయి. రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని లౌకికవాద కాంగ్రెస్‌, మతోన్మాద బిజెపిలు రెండూ మండల్‌ నివేదికను అమలుపరచడానికి వ్యతిరేకించాయి. అయితే, బిజెపి అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం మండల్‌ను మందిర్‌ నినాదంతో విజయవంతంగా ఎదుర్కొంది. రెండవది, గీతా ప్రెస్‌ ఎప్పుడూ పలువురు కాంగ్రెస్‌వాదుల, సోషలిస్టుల ఆదరాభిమానాలను, ప్రాపకాన్ని పొందుతూ వచ్చింది. అలాంటప్పుడు, వెంటనే మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. హిందూత్వకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక లౌకికవాదమే అయితే అప్పుడు ఆ లౌకికవాదం కార్యాచరణ గుజరాత్‌లో మాదిరిగా ఉండాలా? ఇటువంటి పరిస్థితుల్లో చెదిరిపోతున్న దేశ లౌకిక వ్యవస్థను హిందూ మెజారిటీవాదం చింపిపోగులు పెట్టకుండా కాపాడాలంటే ఎవరికైనా ముందున్న మార్గం ద్విజయేతరులైన ఒబిసిలు, దళితుల (వీరు జనాభాలో 60 శాతం ఉన్నారు)ను జాత్యహంకార భావజాలంలోకి చొరబడకుండా చేయడమే. పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు, ఒబిసిలు సామాజిక సాధికారత, స్పష్టమైన ఆర్థిక ప్రగతి సాధించడం ద్వారా మాత్రమే దీన్ని సాధించగలం. అప్పుడే కుల ప్రాతిపదిక ఆధిక్యత అనే భావనకు ఆధారం లేకుండా పోతుంది.
రాజకీయంగా హేతుబద్ధమైనది సామాజికంగా సాహసోపేతమైనదిగా కనిపించవచ్చు. లౌకికవాదానికి అగ్ర కులస్తుల పతాకధారులేమీ కొదవలేదనేది వాస్తవమే అయినప్పటికీ అమలులో సాహసోపేతమైన చర్యే. తన అధికారాన్ని లేదా హక్కులను స్వచ్ఛందంగా వదులుకునే సామాజిక ఆధిపత్య గ్రూపు ఒక్కటైనా ఉందా అనేది చరిత్ర ఇంకా అందచాల్సే ఉంది. బ్రిటీష్‌ వలసవాదం ఆవిర్భవించే వరకూ భారత ఉపఖండ సామాజిక వ్యవస్థలో క్షత్రిక-బ్రాహ్మణ గుత్తాధిపత్యం ఏలినట్లే సమకాలీన భారతదేశంలో బనియా-బ్రాహ్మణ గుత్తాధిపత్యం ఏలుతోంది. ముందుగా, ప్రజాస్వామ్యానికి -పొరపాట్లు ఉన్నప్పటికీ-సామాజికంగా ప్రగతిశీల భావజాలం కలిగిన రాజ్యాంగానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ గుత్తాధిపత్యం, గతంతో పోల్చి చూస్తే, అత్యంత సున్నితమైనదిగా, సవాలు చేయబడేదిగా ఉంది. దాంతో ఈ గుత్తాధిపత్యం బలహీనపడింది. హిందూత్వ, ప్రజాస్వామ్యం లేదా హిందూత్వ, సమానత్వం మధ్య అంతరం ఉండేందుకు అవకాశం లేదని గీతా ప్రెస్‌ పుస్తకాలు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే, కుల వ్యవస్థను నాశనం చేయకుండా లౌకికవాదం కోసం జరిగే పోరులో విజయం సాధించలేం. సమాజాన్ని పట్టి పీడించే హిందూత్వ అనే జాడ్యం వెనుక ఉన్న వైరస్‌ ఈ కుల వ్యవస్థే.
- జి సంపత్‌
(హిందూ సౌజన్యంతో సంక్షిప్తానువాదం)