
ప్రయివేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక యుటిఎఫ్ భవనంలో జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్ అధ్యక్షతన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో దళితులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం లేదన్నారు. గత 30 సంవత్సరాలుగా రిజర్వేషన్లు దళితులకు అందని ద్రాక్షగా ఉన్నాయన్నారు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు అమలవుతున్న నేపథ్యంలో దళితులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దళితుల సమస్యలపై అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ పూర్వ నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎస్‌సి, ఎస్‌టిలను ఉద్దరిస్తామని ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగా మారాయన్నారు.