స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనోద్యమాలు..

ఆదివాసీలు అనాదిగా సభ్యసమాజ సంస్కృతికి, నవనాగరికతకు నాంది. కానీ నేడు ఈ పాశ్చాత్య పోకడల ప్రపంచములో అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఎన్నో పంచవర్షప్రణాళికలు వచ్చినా ఇప్పటి వరకు దేశంలో అనేక ప్రాంతాల ఆదివాసీల అభివృద్ధి అగమ్యగోచరంగానే ఉండిపోయింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 వసంతాలు నిండుతున్నప్పటికీ అభివృద్ధి ఫలాలు అందనంత దూరంలో ఆదివాసీ పల్లె ప్రజలున్నారనడంలో సందేహం లేదు. భారత రాజ్యాంగం అనేక హక్కులు, ఫలాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అనాదిగా వస్తున్న నాటువైద్యంపై ఆధారపడటం, డోలీ మోతలు, గుర్రపు ప్రయాణాలు అనేకం మనకు కనిపిస్తూనే ఉన్నాయంటే కేవలం ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేకపోవటమే కారణం. చరిత్రలో ఎన్నో గొప్ప పోరాటాలు సలిపిన ఆదివాసీలు తమ అభివృద్ధి కోసం ప్రభుత్వాలతో సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలు జరపాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ చరిత్రలో గిరిజన ఉద్యమాలు మరుగున పడిపోయాయని చెప్పాలి. 1857 సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అంటున్నాం. కానీ అంతకు ముందే గిరిజనులు బ్రిటీష్‌ వారిపై అనేక తిరుగుబాట్లు చేశారు. వాటిలో 1829 మే 5న జరిగిన ఖాసీ తిరుగుబాటు ఒకటి. 1835 కాస్సోచార్‌ ఆకాస్‌ గిరిజన నాయకుడు, 1839లో శింఘోలు, 1849లో నాగాలు తిరుగుబాటు చేశారు. మణిపూర్‌, త్రిపుర ప్రాంతంలోని కూకి తెగ తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటీష్‌ వారికి 20 సంవత్సరాలు పట్టింది. 1837లో ఛోటా నాగపూర్‌లోని కోల్‌ గిరిజనులు తిరుగుబాటు చేశారు. గిరిజన తిరుగుబాట్లలో అత్యంత పెద్దది, విస్తృతమైనది సంధాలుల తిరుగుబాటు.
ఈ తిరుగుబాటు వల్ల దీనిని కల్లోల ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం భారీ సైన్యాన్ని తరలించి తిరుగుబాటును పాశవికంగా అణచివేసింది. ఆ తదుపరి చంధాలులు భగీరధ్‌ మంజిహీ నేతృత్వంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా కార్వార్‌ ఉద్యమం కొనసాగించారు. తుదకు 1917లో గానీ ఈ ఉద్యమం అణచివేయబడలేదు. 1879-80 సంవత్సరంలో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తహశీల్దార్‌ అరాచక చర్యలకు, ప్రభుత్వ అండదండలతో మున్సబ్‌దారీ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాన్ని అణచడానికి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పట్టింది. విశాఖపట్నం ఏజెన్సీలోని 5,000 మంది గిరిజనులు కొర్ర మల్లయ్య, అనుకొండదొర నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. 1899-1900లో ముండా తిరుగుబాటు జరిగింది. ఛోటానాగ్‌పూర్‌, దక్షిణ రాంచి (బీహార్‌) లలో నివశించే గిరిజనులు ముండాలు. వీరు 1831లో బీర్సాముండా నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. అయితే జాగీరుదారు (భూస్వామి), రెవెన్యూ అధికారులు, వడ్డీ వ్యాపారులు కదంబ హస్తాల నుంచి, కాంట్రాక్టర్లు విధించే వెట్టిచాకిరీ బౌత్‌ బెగారీ నుంచి విముక్తి పొందుటకు తిరుగుబాటు చేశారు. దీనికి తోడు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు వారిలో తీవ్ర అశాంతిని, ఆందోళనను కలిగించాయి.
ఇలాంటి స్థితిలో వీరం భగవాన్‌గా పలవబడే బిస్రా నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. తరువాత ప్రభుత్వం పెద్ద సైన్యాన్ని పంపి 200 మంది ముండాలను వధించి వారి నాయకుడైన బిస్రాను నిర్బధించింది. బిస్రా జైలు నిర్బంధంలో మృతి చెందగా ముండా తిరుగుబాటు అణచి వేయబడింది. ముండా తిరుగుబాటు విఫలమైనా దాని తీవ్రతను గుర్తించి ప్రభుత్వం 1908లో ఛోటానాగ్‌పూర్‌ కౌలుదారీ చట్టం ద్వారా వారి ఉమ్మడి భూముల హక్కులను (కుంత్‌కత్తి) పునరుద్ధరించటమే గాక, గాల్‌, బేల్‌, బెగారిని, వెట్టిచాకిరీని నిషేధించింది. అంతేగాక జల్‌, జంగిల్‌, జమీర్‌ పోరాటం, తెలంగాణా ప్రాంతంలో కొమరమ్‌ భీమ్‌ పోరాటాలు ఇప్పటికీ మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉంది.