స్వచ్ఛ భారత్‌ ఇలాగా!

అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్‌ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.
దేశాన్ని చెత్త రహితంగా మార్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఎంతైనా అవసరం. బహిరంగ మలవిసర్జన నిర్మూలన, అందరికీ మరుగుదొడ్ల సౌకర్యం, నూటికి నూరు శాతం ఘన వ్యర్థాల సేకరణ- శుద్ధి స్వచ్ఛభారత్‌ లక్ష్యాలు. ఇవి సాధించాలంటే కేవలం ప్రచారం సరిపోదు. నిధులు మొదలుకొని తగినంత మంది ఉద్యోగులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రణాళిక, పర్యవేక్షణ, పౌర సహకారం వంటి ఎన్నో అంశాలు కావాలి. 'స్వచ్ఛ భారత్‌' సాధించాలన్న నిర్ణయం తీసుకుని ఏడాది కాలంలో జరిగిన పనిని విశ్లేషిస్తే మనకు నిరాశే మిగులుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత జులై మాసంలో దేశంలోని వివిధ పట్టణాలు, నగరాలలో 1.42 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగుపడగా అందులో కేవలం 15.33 శాతం మాత్రమే శుద్ధి చేయగలిగారంటే ఆర్భాటపు ప్రచారానికీ, ఆచరణకూ మధ్య ఎంత అగాధం ఉందో అర్ధమవుతుంది. ప్రభుత్వ సహకరాం లేకుండా స్వచ్ఛ భారత్‌ బృహత్‌ లక్ష్యాన్ని నెరవేర్చగలిగే సామర్థ్యం మన నగరపాలక సంస్థలకు లేవనడానికిదే నిలువెత్తు నిదర్శనం. రూ. 66,009 కోట్ల ఖర్చుతో 1.04 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు, 5.28 లక్షల కమ్యూనిటీ, పబ్లిక్‌ టారులెట్లు కట్టించాలన్నది లక్ష్యం. పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికి కేవలం రు.1,038.72 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన నిధులు కేటాయించుకుంటూ పోతే లక్ష్యం చేరడానికి ఎన్ని తరాలు పడుతుందో చెప్పనక్కరలేదు. 
నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పరిస్థితుల మెరుగుదలకు పెద్ద యెత్తున సాంకేతిక పరిజ్ఞానంతోపాటు అట్టడుగుస్థాయి నుంచి నైపుణ్యాలను మెరుగుపర్చాల్సి వుంది. ఘన ద్రవ వ్యర్థ పదార్థాలను విడివిడిగా సేకరించి శుద్ధి చేయడంలో పుర, నగరపాలక సంస్థల సామర్థ్యాల్లోనూ తరతమ బేధాలున్నాయి. మైసూర్‌ మహానగరం పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. అయితే ఆ విజయం వెనక మూడు వేల మంది పారిశుధ్య కార్మికుల కఠోర శ్రమ, పర్యావరణ ఇంజినీర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, మైసూరు మహానగర పాలక మండలి నిరంతర కృషి దాగివున్నాయని మరువకూడదు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్‌ పది సంవత్సరాల క్రితమే వందశాతం మరుగుదొడ్లు కలిగిన తొలి జిల్లాగా దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందంటే అప్పటి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశంసించాల్సిందే. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలలో పాయఖానాలు జాతీయ సగటు 45.80 శాతం కన్నా తక్కువగా, ఎ.పిలో 39.19 శాతం, తెలంగాణలో 33.64 శాతం మాత్రమే వున్నాయి. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడం ఒక ఎత్తయితే వున్న వాటినీ వినియోగించక బహిరంగ విసర్జనకే మొగ్గు చూపడం వెనక సాంస్కృతిక పరమైన అనేక కారణాలున్నాయి. వాటిని విశ్లేషించి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం కూడా ఉంది. 
స్వచ్ఛభారత్‌ సాధించాలంటే పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను బలోపేతం చేయాలి. వాటికి ప్రభుత్వాలనుండి తగినన్ని నిధులు అందించాలి. కానీ మన ప్రభుత్వాలు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక సంస్థలకు నిధులు ఎండగడుతున్నాయి. యూజర్‌ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా నిధులు సేకరించాలంటున్నాయి. ప్రజా సేవలను ప్రయివేటు పరం గావించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. పారిశుధ్య పనులను ప్రయివేటు వారికి అప్పగిస్తూ, కాంట్రాక్టు కార్మికులను నియమిస్తూ స్వచ్ఛ భారత్‌ లక్ష్యాని చేరుకోగలమని ప్రచారం చేయడం కన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. అన్నిటికీ మించి ప్రజల జీవన ప్రమాణాలకూ, పరిశుభ్రతకూ సంబంధం ఉందన్న ధ్యాస మన పాలకుల్లో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. నూటికి యాభైమందికి పైగా ప్రజలు దారిద్య్రంలో బతుకుతున్న దేశంలో ఆ దారిద్య్రాన్ని నిర్మూలించకుండా స్వచ్ఛత సాధించలేమన్నది నిష్టుర సత్యం. అందువల్ల భారత దేశం స్వచ్ఛ భారత్‌ కావాలంటే కేవలం ప్రచారం చేస్తే సరిపోదు. ఒక సమగ్రమైన అవగాహనతో, ప్రణాళికాబద్దమైన కృషితో, తగినన్ని నిధుల కేటాయింపుతో ప్రజలందరినీ భాగస్వాములను చేసినప్పుడే లక్ష్యంవైపు అడుగులు పడతాయి. అలా కానంత కాలం మన స్వచ్ఛ భారత్‌ ఏడాదికొకసారి టీవిల్లో కనిపించే కార్యక్రమాలకే పరిమితమై పోతుంది.