సెప్టెంబర్ 2 సమ్మెకు సిపిఎం మద్దతు..

సెప్టెంబరు 2న నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సిపిఎం తన సంపూర్ణ మద్ధతు తెలియజేసింది. కాకినాడలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సామాన్యులను వంచించి, కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్‌ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. కార్మిక హక్కులు కాలరాస్తున్న కార్పొరేట్ల కోసమే పాలన సాగిస్తున్న పాలకులకు ఈ సమ్మె ద్వారా కార్మికవర్గ హెచ్చరికను తెలియజేయాలన్నారు. ఏవిధమైన కార్మికుడికైనా కనీస వేతనం రూ.15 వేలు తగ్గకుండా ఉండాలన్నారు. కార్మిక చట్టాలు, పకడ్బంధీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ సిపిఎం శ్రేణులంతా కార్మికవర్గ సమ్మెకు మద్దతుగా ప్రత్యక్షంగా నిలబడాలని కోరారు. ప్రజాతంత్ర అభ్యుదయ వాదులంతా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.