ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సర ళీకరణ విధానాలను అమలు చేసిన ఫలితంగా దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనా న్ని కొల్లగొట్టారు. ప్రకృతి ప్రసాదించిన ఖనిజ సంపదను దో చుకోవటానికి పాలక పార్టీల నాయకులు, అధికారులు, కార్పొ రేట్ శక్తులతో కూడిన దుష్టత్రయం మధ్య అక్రమ ఒప్పందాలు కుదిరాయి. ఫలితంగా జాతీయ సంపదను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు కొల్లగొడుతున్నారు. కార్మికవర్గంపై భారా లు వేస్తున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను నీరుగారు స్తున్నారు. అందుకే కార్మిక వర్గం ప్రైవేటీకరణను నికరంగా వ్యతిరేకిస్తున్నది. యుపిఎ హయాంలో కార్మికవర్గం సాగించిన పోరాటాల వల్ల ఆర్థిక సంస్కరణల వేగం మందగించింది. అందుకే ఆర్థిక సంస్కరణలను కఠినంగా అమలుచేయలేని మన్మోహన్‌ను పక్కన పెట్టారు. తమ ఆలోచనలకు అనుగు ణంగా వ్యవహరించగలిగే సమర్థుడైన వ్యక్తిగా మోడీని ఎంపిక చేసుకున్నారు. అందుకే కార్పొరేట్ శక్తులన్నీ ఐక్యమై నరేంద్రమోడీకి బాసటగా నిలబడ్డాయి.
కార్పొరేట్ల ఏజెంట్‌గా మోడీ
ప్రధానమంత్రిగా ఎంపికైన నరేంద్రమోడీ ''ఓట్లేసిన ప్రజల కంటే నోట్లిచ్చిన కార్పొరేట్ వర్గాల సేవే తన పరమా ర్థంగా భావించి'' కాంగ్రెస్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ లను వేగవంతం చేయడమేగాక, కాంగ్రెస్ చేయలేకపోయిన కార్మిక సంస్కరణల అమలునూ భుజాన వేసుకున్నారు. కార్పొరేట్ వర్గాల కోర్కెల మేరకు 'సిఐఐ' 'అసోచామ్' 'ఫిక్కీ'లు ఇచ్చిన ఎజెండాను అమలు చేసేందుకు పూనుకున్నారు. అనే క పోరాటాల ఫలితంగా కార్మికవర్గం సాధించుకున్న చట్టబద్ధ మైన హక్కులన్నింటినీ క్రమంగా రద్దుచేస్తూ, వారి శ్రమదో పిడీని తీవ్రం చేసేలా చట్ట సవరణలకు పూనుకున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రధానంగా రాజస్థాన్‌తో ప్రారంభమై, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ప్రభుత్వాలు ఇప్పటికే కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ తమ శాసనసభల ద్వారా చట్ట సవరణలను ఆమోదింపజేశాయి. రాజస్థాన్ తరహా కార్మిక చట్టాల సవరణకు పూనుకోవాలని, ఆ రకంగా చేయకపోతే మీ రాష్ట్రానికి పెట్టుబడులు రావని బెదిరిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేబర్ కోడ్ పేరుతో కొత్త చట్టం తేవటం ద్వారా ప్రస్తుత కార్మిక చట్టాలను, కార్మికుల హక్కులను పాతర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోరాడి సాధించుకున్న హక్కులపై దాడి
దేశంలోని సంఘటితరంగంలో కూడా అత్యధిక శాతం కార్మికులకు ట్రేడ్ యూనియన్లు లేవు. అసంఘటితరంగంలో పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నది. కేవలం పది శాతం మంది కార్మికులు మాత్రమే ట్రేడ్ యూనియన్లలో ఉన్నారని కార్మికశాఖ ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. కనీసం యూనియన్ ఉంటే కార్మికశాఖ ద్వారానో, ప్రభుత్వ అధికారుల ద్వారానో కొన్నైనా హక్కులు సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు ఇది ఇష్టం లేదు. రాబోయే కాలంలో ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్ అసాధ్యంగా మారనున్నది. ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు స్వయంగా కేంద్ర కార్మికశాఖా మంత్రి దత్తాత్రేయ ప్రకటించడాన్ని బట్టే వారి ఆలోచనలు అర్థమవుతున్నాయి. ప్రస్తుత ప్రతిపాదన ప్రకారం ఏ పరిశ్రమలోకానీ, రంగంలోకానీ యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే పది శాతం కార్మికులు సంతకాలు చేసి దరఖాస్తును సమర్పించాలి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏడుగురు కార్మికులు సంతకాలు చేసి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. పది శాతం కార్మికులు, అనగా కొన్ని వందల మందిలో ఏ ఒక్కరు వెనక్కు తగ్గినా యూనియన్ రిజిస్ట్రేషన్ జరగదు. అలాగే ప్రస్తుత చట్టంలో నాయకులుగా బయటివారు 50 శాతం ఆఫీసు బేరర్లుగా ఉండవచ్చును. ప్రతిపాదిత బిల్లులో కార్మిక సంఘాల్లో బయటి వ్యక్తులు నాయకులుగా ఉండకుండా నిబంధన చేర్చారు. కార్మిక సంఘాల చట్టంలో ప్రతిపాదిత సవరణలు కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదంగా మారబోతున్నాయి.
సామాజిక భద్రతపై వేటు
ప్రస్తుత పారిశ్రామిక వివాదాల చట్టంలో మార్పులుచేసి హైర్ అండ్ ఫైర్ విధానం యజమానుల హక్కుగా సవరణ చేయబోతున్నారు. దీనివల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడబోతున్నది. లేఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్లు యజమానుల హక్కుగా మారుతుంది. ట్రేడ్ యూనియన్ కార్యకర్తలకు ఎలాంటి రక్షణా ఉండదు. ట్రేడ్ యూనియన్ల నిర్వహణే ప్రమాదంలో పడబోతున్నది. అలాగే ప్రస్తుత పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించి సమ్మెలను అదుపు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొంటే రూ.50 వేల నుంచి రూ.6 లక్షల వరకు జరిమానా విధించి వసూలు చేసేలా కొత్తచట్టంలో ప్రతిపాదించారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధించే నిబంధన కూడా చేర్చారు. ఈ జరిమానాను కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి వసూలు చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నిరసన తెలిపే మౌలిక హక్కుకు పూర్తి విరుద్ధమైనది. అంతేగాక చిన్న పరిశ్రమలకు రాయితీల పేరుతో ఆ పరిశ్రమల్లో కార్మిక చట్టాలు ఏవీ అమలుకాకుండా మినహాయింపులు ఇచ్చేలా చట్ట సవరణ రాబోతోంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్(పిఎఫ్), ఇఎస్‌ఐ చట్టాలను మరింత కఠినంగా అమలు జరపడం కాకుండా ఆ చట్టాలను సవరించి, వాటిని స్వచ్ఛంద పథకాలుగా అమలుచేసే స్వేచ్ఛ యాజమాన్యాలకు ఉండేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయబోతున్నది. అంతేగాక భవిష్యత్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక భద్రతా పథకాలేవీ కార్మికులకు మిగలవు.
విదేశీ పెట్టుబడులతో ఒరిగిందేమీ లేదు
గత 25 సంవత్సరాలుగా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలో పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించటానికి ఉపయోగపడింది లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ లాంటి త్వరగా లాభాలు సంపాదించుకోవటానికి అవకాశమున్న రంగాల్లోకి మాత్రమే వచ్చాయి. భారతదేశంలో సరుకులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలు చేసుకోవడం కంటే, తమ స్వదేశాల నుంచి నేరుగా సరుకులను దిగుమతి చేసుకొని తమ దేశాల్లో ఉపాధిని కాపాడుకోవడంపైనే విదేశీ కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు ప్రపంచమంతటా ఇవే విధానాలను అమలు చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు ఈ దేశంలోనూ, విదేశాల్లోనూ అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని వెలికితీసి దేశంలోకి రప్పించినా, శతసహస్త్ర కోటీశ్వరుల సంపదపై ఆంక్షలు పెట్టినా ప్రభుత్వానికి కావాల్సినన్ని పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి. అలాంటి చర్యలు తీసుకోకుండా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఫలితాలు రావు. విదేశీ పెట్టుబడి రావాలంటే స్వదేశంలో కార్మికవర్గాన్ని అణచివేయాలనే ఆలోచనే పరమ దుర్మార్గమైంది. బిజెపి ఈ దుర్మార్గానికి సిద్ధంగా ఉన్నది. మోడీ ఇప్పటికే 23 దేశాలు తిరిగి, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలా సహకరిస్తామని వారి ముందు మోకరిల్లి కోరారు. ఈ సంవత్సర కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వసంస్థల అమ్మకం-మొదటికే మోసం
మోడీ ప్రభుత్వం వచ్చిన మొదటి మూడు నెలల్లో రూ.43 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను ప్రయివేటువారికి అప్పగించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.69 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇన్సూరెన్స్ రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. రైల్వేలలోనూ, రక్షణరంగంలోనూ నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని ఒక విధాన నిర్ణయం చేస్తామని చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ రకంగా విదేశీ పెట్టుబడులకు లొంగిపోవడం ఎప్పుడూ జరగలేదు. అందుకే సెప్టెంబర్ 2 సమ్మెలో కార్మికవర్గం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి స్పష్టమైన వైఖరి తీసుకున్నది.
డిమాండ్లు
1. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించడాన్ని వ్యతిరేకించాలి. 2. రైల్వే, రక్షణ, ఇన్సూరెన్సు రంగాలతో సహా కీలక రంగాలన్నింటిలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాకుండా నిరోధించాలి, 3. సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను బలపర్చాలి. ధరల పెరుగుదలను అరికట్టాలి. 4. ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచి, నిరుద్యోగ సమస్యను నివారించాలి. 5. స్కీం కార్మికులందరినీ ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి, వారికి చట్టబద్ధ హక్కులను, కనీస వేతనాలను అమలుచేయాలి. 6. అసంఘటితరంగ కార్మికులందరికీ నెలకు రూ.15 వేలను కనీస వేతనంగా నిర్ణయించి, అమలు చేయాలి. 7. అసంఘటిత కార్మికులందరికీ సాంఘిక భద్రత కల్గించేలా సమగ్ర చట్టం చేయాలి. 8. కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి కార్మికులను పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలి. 9. ఇటీవల జారీ చేసిన బలవంతపు భూ సేకరణ ఆర్డినెన్సును రద్దుచేయాలి. 10. ఐఎల్‌ఒ తీర్మానాలన్నింటినీ అమలుచేయాలి.
వీటిలో నేరుగా కార్మికుల స్వీయ ప్రయోజనం కొరకు పెట్టిన కోర్కెలు ఏవీలేవన్నది స్పష్టం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ఆర్థికాభివృద్ధికి పునాదిగా ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆర్థిక సంస్థలను, ప్రభుత్వ బ్యాంకులను కాపాడుకోవాలనే జాతీయ స్ఫూర్తితో ఈ సమ్మె పిలుపు ఇవ్వబడింది. కార్మికుల, కష్టజీవుల, రైతుల, కూలీల, సామాన్య ప్రజల హక్కుల కోసం సాగుతున్న పోరాటంలో సెప్టెంబర్ 2 సమ్మె ఒక పెద్ద ముందడుగుగా ఉండబోతోంది. ఈ సమ్మెను సర్వవిధాలా బలపరిచి జయప్రదమయ్యేలా కృషి చేయడం ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదుల ముందున్న కర్తవ్యం.
- ఎంఎ గఫూర్