సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. కేంద్రం పెట్రోలు, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడంతో రైతులపై వందల కోట్ల రూపాయల భారాలు పడ్డాయని, ఇదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న కౌలుదారులు తీవ్రంగా నష్ట పోతున్నారని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పనిలేని రోజుల్లో ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకం నిధులూ దారి మళ్లించి, అధికారపార్టీ నాయకులకు దోచి పెడుతున్నారని, దీంతో రైతులు, కూలీల పరిస్థితి దారుణంగా మారిందని, ఈ సమస్యలపై పోరాడేందుకు టిడిపి, వైసిపి, బిజెపి, కాంగ్రెస్‌ సిద్ధంగా లేవని సదస్సు భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించనున్నామని నాయకులు చెప్పారు. విభజన హామీల అమలుపై కేంద్రం దృష్టి పెట్టడం లేదని, చట్ట ప్రకారం ఉన్న హక్కులు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, రైల్వేజోన్‌ కావాలని అడిగితే పరిశీలిస్తున్నామని రైల్వేశాఖ మంత్రి ఎగతాళిగా మాట్లాడుతున్నారని సదస్సు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టంలో ఉన్న విధంగా రైల్వేజోన్‌, కడప ఉక్కు, సెంట్రల్‌, గిరిజన యూనివర్శిటీలు, రాజధాని,పోలవరం, రామాయపట్నం పోర్టు అత్యంత కీలకమైనవని, వాటిని ఇంతవరకు ఇవ్వలేదని, కడప స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఈనెల 29న కడప జిల్లా బంద్‌ జరగనుందని, అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. కీలకమైన ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టానికి కేంద్రం సవరణలు చేసిందని, మరోవైపు రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై అఘాయిత్యాలు పెరిగాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై నోత్తడం లేదన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే పోలీసులు వాటిని రాజీ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ పరిస్థితిని నివారించి, బాధితులకు ధైర్యం చెప్పి, నిందితులకు కఠినశిక్ష పడేవిధంగా చూడాలని కోరారు. పల్స్‌ పోలియో సందర్భంలో ప్రచారం నిర్వహిస్తున్న విధంగానే మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం ప్రత్యేక క్యాంపెయిన్‌ చేయాలని కోరారు. రాష్ట్రంలో కాలువలన్నీ మురుగుతో నిండిపోయాయని, డెంగ్యూ, మలేరియా వ్యాధి నగరంలో ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఆందోళనల్లో భాగంగా ఈరోజు ఈ సిపిఎం, సిపిఐ ఉమ్మడి సదస్సు నిర్వహించామని చెప్పారు.