సీమకు లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

రాయలసీమకు తక్షణమే లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. వెనుకబడిన రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఏడాదిలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు. కేంద్రం నిధులిచ్చే వరకూ పోరాటం ఉధృతం చేయాలన్నారు. బడ్జెట్‌లో వాటా కేటాయించాలనీ, లేకపోతే తమను అరెస్టయినా చేయాలని ఆల్టిమేటం ఇచ్చారు.