సీపీఐ ‘పముజుల’పై హత్యాయత్నం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పముజుల దశరథరామయ్యపై నెల్లూరు రూరల్‌ మండలం సౌత్‌మోపూరులో మంగళవారం హత్యాయత్నం జరిగింది. గ్రామ పంచాయతీ చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. రూ.5లక్షలతో పంచాయతీ డ్రైనేజీ కాలువ నిర్మిస్తోంది. అయితే, హైస్కూల్‌ కూడలిలో స్థానికంగా నివాసముండే బట్టేపాటి ప్రతాప్‌ కాలువ తమ స్థలంలో ఉందంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. గ్రామపెద్దలు, సీపీఐ సీనియర్‌ నేత పముజుల దశరథరామయ్య జోక్యం చేసుకుని డ్రైనేజీ కాలువ పూర్తిగా పంచాయతీ స్థలంలో ఉందని, రెవెన్యూ సర్వే ప్రకారమే నిర్మాణం జరుగుతోందంటూ తేల్చి చెప్పారు. అయినా మాటవినని ప్రతాప్‌ పముజులపైకి దూసుకెళ్లాడు. గడ్డపారతో దశరథరామయ్యను పొడిచేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన ఆయన తన కుడిచేతిని అడ్డంపెట్టాడు. దీంతో చేతికి తీవ్రగాయం కావడంతో దశరథరామయ్య స్పృహ కోల్పోయారు. పముజులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.