సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణానికి సేకరించిన భూముల్లో పరిశ్రమలు వెంటనే స్థాపించాలి : సిపిఎం

పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూములలో వెంటనే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం స్థానిక కన్నెగంటి హనుమంతు భవన్‌లో సిపిఎం నాయకులు లేళ్ల లక్ష్మిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ 12సంవత్సరాల క్రితం సిమెంట్‌ఫ్యాక్టరీల కోసం వివిధ ప్రైవేటు సంస్థలు 12వేల ఎకరాలు భూములను పల్నాడు ప్రాంతంలో సేకరించారని ఇప్పటి వరకూ ఒక్కఫ్యాక్టరీ కూడా నిర్మించలేదన్నారు. వెంటనే పరిశ్రమలు స్థాపించి యువకులకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాలని కోరారు. కేంద్రప్రభుత్వం నల్లధనం వెలికితీసే పేరుతో పెద్దనోట్లను రద్దుచేసి పేదల కొనుగోలు శక్తిని దెబ్బతీసిందని ఉత్పత్తి రంగంపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు తీరని అన్యాయం చేసిందని, దళిత గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించలేదన్నారు. సిపిఎం డివిజన్‌ కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ మిర్చిపంటకు రూ.12వేలు మద్దుతుధర ప్రకటించాలని, కందిపంటకు రూ.7వేలు ప్రకటిం చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్భంధకాండను ప్రయోగిస్తుందని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.