సిఐటియు కార్యాలయం పోరాటాల కేంద్రం

పల్నాడులో నిర్వహించే ప్రజా పోరాటాలకు పిడుగురాళ్లలోని సిఐటియు కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ పేర్కొన్నారు. పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన సిఐటియు కార్యాలయం (కన్నెగంటి హనుమంత్‌ భవనం)ను ఆయన బుధవారం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ శిలాఫలకాన్ని గఫూర్‌ ఆవిష్కరించగా ప్రధాన గదిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు ప్రారంభించారు. యూనియన్‌ పతాకాన్ని రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు కార్యాలయం నుంచి ఐలాండ్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు సిఐటియు పల్నాడు ఏరియా కార్యదర్శి గోపాలరావు అధ్యక్షత వహించారు. గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికుల కోసం కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో మత ఉద్రిక్తతలూ పెరిగడంతోపాటు మైనార్టీలు, మతోన్మాదనాన్ని వ్యతిరేకించే మేధావులు, కవులు, కళాకారులపై దాడులకు పూనుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికీ తూట్లు పొడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తినే నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో కార్మిక వర్గమంతా ఉద్యమించాలని, హక్కులతోపాటు లౌకకతత్వాన్నీ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ పల్నాడులో 12 వేల ఎకరాలను ప్రభుత్వం సిమెంట్‌ ఫ్యాక్టరీల నిర్మాణాలకు, పరిశ్రమలకు దారాదత్తం చేసిందని, అయితే నిర్మాణాలు మాత్రం ప్రారంభం కాలేదని అన్నారు. భూములిచ్చిన రైతులకు ఒక్కో ఇంటికి ఒక్కొ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మాటతప్పిన యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని భూములను రైతులకు తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికుల జీతాలు పెంచుతామని హామీనిచ్చిన చంద్రబాబు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, పైగా ఉద్యమాలను అణచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్కకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న చంద్రబాబు గోదావరి పుష్కరాలు రూ.1600 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు, రానున్న కృష్ణా పుష్కరాలకు రూ.రెండువేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. సభాధ్యక్షులు గోపాలరావు మాట్లాడుతూ సిఐటియు కార్యాలయం సిఐటియు అనుబంధ సంఘాల్లోని ప్రతి కార్మికుని కష్టమని, ఏ ఒక్క కార్మికునికి కష్టమొచ్చినా యూనియన్‌ వారికి అండగా ఉంటుందని ఉద్ఘాటించారు.