
కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ హెచ్చరించారు. సిఐటియు పశ్చిమగోదావరి జిల్లా పదో మహాసభల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గఫూర్ మాట్లాడారు. పారిశ్రామిక ప్రగతిని స్వాగతిస్తున్నామని, ఈ పరిణామంలో కార్మిక చట్టాలకు విఘాతం కలిగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యత దెబ్బతీయడానికి ఐదు కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.