సింగ‌పూరా?..ఇస్తాంబులా..?

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల నుండి భయపెట్టి ఇప్పటి వరకు 33,500 ఎకరాల భూమి తీసుకున్న ప్రభుత్వం సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఊహాచిత్రాలు విడుదల చేసి రాజధాని నిర్మాణం ఆగమేఘాలమీద జరిగిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. రెండు రోజుల నుండి పత్రికల్లో (ముఖ్యమంత్రి అనుకూల పత్రిక) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనల తీరు మారింది. టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్‌ తరహాలో నిర్మాణం చేపడతామని వార్తలు లీక్‌ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఆ పార్టీకి చెందిన వెంకటపాలెం మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ నరసింహారావు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ విషయంపై నమ్మకం ఉంచుతూనే అనేక సందేహాలు వెలిబుచ్చుతూ పత్రికా ప్రకటన చేయడం కూడా స్థానికంగా సంచలనం కలిగించింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి నోటి నుండి మాట మాటకు మార్పు రావడంతో వారు ఖిన్నులవుతున్నారు. నిన్నటి వరకు సింగపూర్‌ జపం చేసిన ముఖ్యమంత్రి నేడు ఇస్తాంబుల్‌ జపం చేయడం పట్ల ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రభుత్వం తన పదవీ కాలంలో రాజధాని నిర్మాణం జరుగుతుందా అని రైతుల్లో అనుమానాలు మొదలయ్యాయి.