సామాజిక న్యాయమా? ఆధిపత్యమా?

మరోసారి రిజర్వేషన్లపై రగడ మొదలైంది. గుజరాత్‌ పటేళ్ల ఆందోళన దీన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఇది చాలా ఆందోళన కరమైన పరిణామం. తమను వెనకబడిన తరగతుల్లో చేర్చి రిజర్వేషన్లు వర్తింపజేయాలని వారు చేపట్టిన ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. ప్రధాని సొంత రాష్ట్రం అభివృద్ధికి ఆధునిక నమూనాగా చెప్పబడుతున్న గుజరాత్‌లో ఈ పరిణామం జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనంటూ మీడియా ఊహాగానాలు మొదలు పెట్టింది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీ దీనివల్ల లాభపడుతోంది? అంతిమంగా ఇది రిజర్వేషన్లను ఎత్తివేసే వైపు సాగుతుందా? పటేళ్లు నిజంగానే వెనకబడిన వారా? పటేళ్లతోబాటు జాట్‌లు, కమ్మ, రెడ్డి వంటి కులస్తులకు వెనకబడిన తరగతుల హోదా ఇస్తే ఇంక వెనకబాటుతనానికి అర్థం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతాయి. రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటి? దానికున్న పరిమితులేమిటి? ఫలితాలు ఎలా ఉన్నాయి? అందులో ప్రత్యేకించి ప్రభుత్వరంగం క్షీణించి, ప్రైవేటురంగం ఊపందుకున్న తరుణంలో ప్రస్తుత రిజర్వేషన్ల వ్యవస్థ ఎంత వరకు సామాజిక న్యాయానికి తోడ్పడగలదు? ఈ నేపథ్యంలో గుజరాత్‌ పరిణామాలను పరిశీలించాలి.
ఒకటి, గుజరాత్‌లో ఈ ఘటన జరగడం చర్చ తీవ్రతకు మూల కారణం. మోడీ చెప్పుకుంటున్నట్లు గుజరాత్‌ నిజంగా అభివృద్ధి అయివుంటే బాగా అభివృద్ధి చెందిన పటేల్‌ కులస్తుల్లో ఇంత ఉధృతంగా ఆందోళన ఎందుకు వచ్చిందన్న దానికి వారు సమాధానం చెప్పి తీరాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆ కులంలోనే నిరుద్యోగం ఇంత తీవ్రంగా ఉంటే ఇంకా మిగతా కులస్తుల సంగతేమిటి? వ్యవసాయం, వ్యాపారాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ వాణిజ్యం, హోటళ్లు, ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారాల్లో గుజరాత్‌ నుంచి అమెరికా వరకు పటేళ్లదే ఆధిపత్యం. అమెరికా కేంద్రంగా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి స్థాయికి ఎదిగారు. మరో వైపు సంపదలో ఆధిపత్యం కలిగినవారిలో పటేళ్లదే అగ్రస్థానమైనా, అదే పటేళ్లలో నూటికి 90 మంది పేద, మధ్యతరగతివారేననడం స్పష్టం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్న 1,500 మందిలో పటేళ్లు అగ్రభాగాన ఉన్నారు.
అప్పులు చేసి పిల్లలను చదివించినా ఉద్యోగానికి దిక్కులేదు. పైగా పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో మోడీ ప్రభుత్వంలో వ్యవసాయానికిచ్చే ప్రోత్సాహకాలు తగ్గించడమే కాకుండా అప్పనంగా భూముల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేసి ంది. రైతుల పిల్లలను చదివించుకుంటే ఉద్యోగాలొస్తాయి. ఉద్యోగాలొస్తే ఇంతకన్నా మంచి బతుకు బతకవచ్చని భ్రమింప జేశారు. నిజమేనని నమ్మిన రైతులు మోసపోయామని ఇప్పుడు వీధి బాట పట్టారు. వారిలోని అసంతృప్తిని గమనించిన హార్ధిక్‌ పటేల్‌ అనే 22 ఏళ్ళ యువకుడు చొరవ తీసుకుని మూ డేళ్ల క్రితం ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇతను నీళ్ల ట్యాంకుల వ్యాపారం చేసేవాడు. తండ్రి మధ్య తరగతి. బిజెపిలో మధ్య తరహా నాయకుడు. ఇవే భావాలను పుణికిపుచ్చుకున్న హార్ధిక్‌ పటేల్‌ ఉన్నత కులాలకు రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్‌ లేవనెత్తాడు.
1981లో ఇదే కులానికి చెందిన నాయకులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆనాడు దాని వెనక ఆరెస్సెస్‌ ఉంది. వారు ప్రధానంగా దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులకు సైతం తెగబడ్డారు. ఈసారి కూడా అలాంటి లక్షణమే కనబడుతోంది. నాడు వారు ప్రోత్సహించిన ఉద్యమం ఆఖరికి ఢిల్లీకి పాకి ఉన్నత కులాల విద్యార్థులను చేరి దేశవ్యాప్తమైంది. దాని ఫలితంగా రిజర్వేషన్లు ఎత్తివేయకుండానే తెలివిగా దానికి చిల్లులు పెట్టారు పాలకులు. విద్యలో ప్రైవేటీకరణకు పెద్దపీట వేసి ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌ యాజమాన్యంలో ప్రారంభించారు. కేపిటేషన్‌ ఫీజు, మేనేజ్‌మెంట్‌ కోటా, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు (ప్రభుత్వ విద్యా సంస్థల్లో) అంటూ డబ్బున్నవారికి సగం సీట్లు రిజర్వు చేశారు. వారు చదవకపోయినా, మార్కులు రాకపోయినా సీటు కొనుక్కొని మెరిట్‌ స్థానం పొందారు. తరువాత దానికి కొనసాగింపుగా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించారు. ఉనికిలో ఉన్న ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారు. ఉన్న సంస్థల్లో కూడా శాశ్వత ఉద్యోగుల స్థానంలో తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకున్నారు. ఆఖరికి ఆచరణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు రెండింటిలోనూ రిజర్వేషన్లు అమలుకాకుండా పోయాయి. రాజ్యాంగంలోనూ, చట్టంలోనూ రిజర్వేషన్లు ఉన్నా అవి కొరగాకుండా పోయాయి. పాలకవర్గాల కుటిల నీతికి ఇది సజీవ ఉదాహరణ. ఫలితంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్‌ రంగంలో నాల్గవ తరహా ఉద్యోగాలు మినహా, నిపుణత కలిగిన ఉద్యోగాల్లో 4 శాతం లోపే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో సైతం గరిష్టంగా పది శాతానికి మించడం లేదు. ఈ స్థితిలో ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కావాలని దళిత, గిరిజన, బలహీన వర్గాల యువత కోరుతోంది. ఇప్పుడు అసలు రిజర్వేషన్లకే ముప్పు తెచ్చే విధంగా పటేళ్ల ఆందోళన మొదలైంది. ఇస్తే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. లేదంటే మొత్తం ఎత్తివేయండి అనేది వారి నినాదం. అహ్మదాబాద్‌ ర్యాలీలో వారు పట్టుకున్న బ్యానర్లు సైతం అవే. రిజర్వేషన్లకు వ్యతిరేకమైన దేశవ్యాప్తంగా అగ్రకులాలను కూడగట్టే పనిలో వారు పడ్డారు. మరోసారి సామాజిక న్యాయంపై దాడి మొదలైంది.
ఈ రిజర్వేషన్లు ఎంత కాలం? ఇస్తే మెరిట్‌ ప్రాతికదికపైనో, లేదంటే ఆర్థికంగా వెనుకబడినవారందరికీ రిజర్వేషన్లు ఇవ్వండి, లేదంటే ఎత్తేయండి అంటోంది అగ్రకుల యువత. ఎంత కాలం రిజర్వేషన్లు అనేవారు ముందుగా ఒక విషయం ఆలోచించాలి. ఎంతకాలం ఈ అంటరానితనం? ఈ సామాజిక వివక్షత. గ్రామాల్లో అగ్రకుల యువత ముందుకొచ్చి ముందు ఈ అంట రానితనానికి వ్యతిరేకంగా నిలబడి ఆపైన ఈ డిమాండు చేస్తే బాగుంటుంది. రిజర్వేషన్లకు పునాది ఆర్థిక స్థితి కాదు, సామాజిక స్థానం. తరతరాలుగా అంటరాని తనానికి గురవుతూ ఆస్తిపా స్తులు లేకుండా భూస్వాములకు బానిస చాకిరీ చేస్తూ బతుకు తున్నవారిని ఆ స్థానం నుంచి బయటపడేయడానికి కొంతలో కొంత ఉపశమనం కలుగుతుందని రాజ్యాంగంలో అంబేద్కర్‌ చొరవతో దానిని పొందుపరిచారు. దానికోసమే ఆయన అగ్రకుల భూస్వామ్య వర్గాలతో ఢకొీని నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు నూతన ఆర్థిక విధానాలు దానికి చిల్లుపెట్టాయి.
నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రతికూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రైవేట్‌ రంగం విస్తరణతో మొదట లాభపడ్డ అగ్రకుల, మధ్య తరగతి వర్గాల్లో ఇప్పుడు నిరుద్యోగం ప్రబలింది. ప్రభుత్వ రంగ పతనంతో వెనకబడిన సామాజిక వర్గాల్లో ఉపాధి తగ్గి ఇప్పటికే నిరుద్యోగం పెరిగింది. ఉన్న కొద్దిపాటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరోసారి కుల యుద్ధం మొదలైంది. నిజానికి కులాలవారీ ఉపాధి పరిశీలిస్తే ఐటి వంటి నైపుణ్యం కలిగిన రంగాలు మొదలుకొని, ఆటో వంటి పారిశ్రామిక రంగం వరకు అగ్రకులాలు తమ జనాభా నిష్పత్తికి మించి ఉపాధి పొందగా సామాజిక తరగతులు అతి తక్కువ స్థాయిలో ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు ఇవ్వడానికి బదులు ఆఫర్‌మేటివ్‌ యాక్షన్‌ (సానుకూల చర్యలు), ఇన్‌క్లూజివ్‌ పాలసీ (కలుపుకునే విధానం) వంటి నినాదాలతో వెనకబడిన సామాజిక తరగతుల్లోని మధ్యతరగతిని భ్రమల్లో ముంచారు. తాజాగా స్టార్టప్‌, స్టాండప్‌ అంటూ ప్రధాని మోడీ ఇచ్చిన నినాదం కూడా ఇలాంటిదే. దళిత, గిరిజన, బలహీన వర్గాల యువత కొత్తగా వ్యాపారం, పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యాంకులు చేయూతనిస్తాయన్నది సారాంశం. ఉపాధికి బదులు పెట్టుబడులు ఇస్తాం. మీరే ఇతరులకు ఉపాధి కల్పించండంటున్నాడు. ఈనాటి పోటీ ప్రపంచంలో అందునా సంక్షోభ సమయంలో చిన్న చిన్న పరిశ్రమలతో నెగ్గగలరా? ఆఖరుకు అప్పులు తీర్చలేక మూతపడే పరిస్థితి రాదా? గత అనుభవం ఏం చెబుతోంది? ఉపాధి పెరగాలంటే తప్పకుండా పరిశ్రమలు పెరగాలి. కానీ, ఆ పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే అందులో తయారయ్యే సరుకులను కొనుక్కొనే శక్తి ప్రజలకుండాలి. ఆ శక్తి ప్రజలకు రావాలంటే ఆదాయం పెరగాలి. దానికి ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచించాలి. అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు లేవు. అందుకే సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మె జరిగింది. ఇటీవల ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సంపాదకీయంలో కార్మికుల వేతనాలు పెంచితేనే పరిశ్రమలు విస్తరిస్తాయని చెప్పింది. అంతేకాదు, కార్మికులకు తగినంత విశ్రాంతి సమయం కూడా ఉండాలంది. విశ్రాంతి సమయంలో వారు టీవీ, సినిమాలు చూడడం, షికార్లకు వెళ్లడం వంటి పనులు చేస్తారు. తద్వారా ఖర్చు చేస్తారు. అది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతుందని భాష్యం చెప్పారు. వారి ప్రయోజనాల రీత్యానైనా తగినంత వేతనం, విశ్రాంతి ఉండాలని చెప్పారు. కానీ, ప్రభుత్వం దానికీ స్పందించడం లేదు. పెట్టుబడిదారులు కార్మికులను దారుణంగా పీక్కుతింటున్నారు. ఈ స్థితిలో కార్మికులంతా ఏకమై ఒక్కతాటిపైకి వస్తేనే వీటిని సాధించుకోగలరు. దానికి ప్రతిగా పాలకులు కుల వైరుధ్యాలను పెంచుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, ఆత్మహత్యలు పెంచుతున్న తమ విధానాలపై యువతరం తిరుగుబాటు చేయకముందే వారిలో కుల తగాదాలు రెచ్చగొట్టి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని పాలకుల తలంపు. అదే వారి పథకం కూడా. అందుకే శ్రామికుల్లో చీలికలు తెచ్చే కుటిల నీతికి తెరలేపారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న సామాజిక న్యాయంపై వేటు వేయాలని చూస్తున్నారు. వెనక బడిన వివిధ సామాజిక తరగతులు ఈ కుట్రలను గమనించకుండా పాలకుల కుటిల నీతిలో బలిపశువులుగా మారితే సామాజిక న్యాయం కావాలన్న కలలకు శాశ్వతంగా సమాధి కట్టుకోవాల్సిందే. కొందరు దళిత మేధావులు ప్రభుత్వ విధానాలపై పోరాడడానికి బదులుగా ప్రభుత్వంతో మంచిగా ఉంటూ లాబీ చేయడం ద్వారా హక్కులు సాధించుకోవాలంటున్నారు. ఆచరణలో ఇది ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని రుజువైంది. ఇప్పటికైనా సంఘటితపడి పాలకుల నయవంచక విధానాలపై పోరాడడానికి ముందుకు రావాలి. దానికి అగ్రకులాల్లోని ప్రజాతంత్రవాదులు, సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా కలుపుకుని పోవాలి. ఆర్థికంగా వెనకబడినవారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆ కులాల్లోని ఉన్నతవర్గాల పోటీని తట్టుకుని వారు నిలబడగల్గుతారు.
తమకు ఉద్యోగాలు రాకపోవడానికి రిజర్వేషన్లు కారణం కాదని అగ్రకుల యువత తెలుసుకోవాలి. ఏ లెక్కల ప్రకారం చూసినా ఇది నిజం. రిజర్వేషన్లు లేని ప్రైవేటురంగం ఎందుకు అగ్రకుల యువతకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేకపోయింది. ఉన్న వాళ్లను కూడా ఎందుకు తొలగిస్తున్నారు? పదేళ్ల క్రితం మెరిట్‌ ఉన్నవారని ఉద్యోగాల్లోకి తీసుకొని ఇప్పుడు పనికిరారని ఎందుకు తీసేస్తున్నారు. వారెక్కడకు పోవాలి. కనీసం వారి ఉపాధిని కాపాడటానికి కార్మిక చట్టాలు కూడా పనికిరాలేదు. వాటిని నిర్వీర్యం చేశారు. అది నేడు యువత పాలిట శాపంగా మారింది. శక్తి ఉన్నంత వరకు పీల్చి పిప్పిచేసి తీరా కుటుంబం స్థిరపడాల్సిన దశలో ఉద్యోగాన్ని ఊడగొట్టేస్తున్నారు. అగ్రకుల యువత ఈ అన్యాయాన్ని ప్రశ్నించదా? నిజానికి కార్పొరేట్‌ రంగానికి ఉపాధి కల్పించడం కన్నా లాభాలు మూటకట్టుకోవడం పైనే ధ్యాస. వారిని కాపాడే పనిలో ప్రభుత్వాలున్నాయి. అందుకే మొదట ఈ ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలి. అందరికీ ఉపాధి కల్పించాలన్న నినాదం చేపట్టాలి. అదే యువతరం శక్తిని పెంచి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తుంది.
- వి శ్రీనివాసరావు
(వ్యాసకర్త సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు)