'సాగు' సమస్యల సుడిగుండంలో కౌలు రైతులు

రాష్ట్రంలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయి. గత వ్యవసాయ లాభ నష్టా లు మరిచిపోయి ఎన్నో ఆశలతో 'సాగు' కదనరంగంలోకి దూకుతున్న 'సాగు' దారులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నారు. సాగు భూమిలో 70 శాతం పైగా వీరే సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, తదితర జిల్లాల్లో వ్యవసాయరంగంలో కౌలు రైతులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారి సమస్యలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధా నంగా రుణమాఫీ కాక, కొత్త రుణాలు అందక, రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వక, పెరిగిన కౌలురేట్లు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వక పెరిగిన పెట్టుబడి ఖర్చులతో 'సాగు' భారం మోయ లేక కౌలు రైతులు నలిగిపోతున్నారు. మరింత బక్కచిక్కి పోతున్నారు.
రుణమాఫీ అమలు ఏది?
రాష్ట్రంలో 2.20 లక్షల మందికి రైతుమిత్ర, జె.ఎల్‌ గ్రూపులు, రుణగుర్తింపు కార్డులపై ఇచ్చిన రూ.574 కోట్లు రుణాలుమాఫీ చేస్తామని హమీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీలు, అధ్యయనం పేరుతో కాల యాపన చేశారు. ఎట్టికేలకు 2014 ఆగస్టు 14న రుణమాఫీకి జీవో 174ను విడుదల చేశారు. జీవోలో రైతుమిత్ర, జె.ఎల్‌. గ్రూపులు, కౌలు రైతుల రుణమాఫీకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల్లో మాత్రం ఈ రుణాలు మాఫీకి అర్హత సాధించకుండా చూశారు. కౌలురైతులను మభ్య పెట్టారు. దఫదఫాలుగా ఛలో కలెక్టరేట్లు, మండల తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు, ఆందోళనలు పెద్దఎత్తున నిర్వహించిన ఫలితంగా వీరి రుణాలు మాఫీకి ప్రభుత్వం అంగీకరించింది. రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అందుకు జీవో ఇవ్వడం లేదు. కౌలు రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేసింది. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు కొత్తవారికి అప్పులు ఇవ్వడంలేదు. పాతవారి రుణాలు రికవరీ కాకుండా కొత్తవారికి ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం లెక్కలు పరిశీలిస్తే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014-15 రాష్ట్రంలో 3,39,214 మందికి రుణ అర్హత కార్డులు ఇస్తే 36,543 మందికి కేవలం రూ.63 కోట్లు పంటరుణాలు ఇచ్చారు. కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క కౌలు రైతుకూ రుణం ఇవ్వలేదు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 35 వేలమందికి రూ.59 కోట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాల్లో రూ.లక్షల్లో మాత్రమే అతికొద్ది మందికి ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే కౌలు రైతులకు రుణం ఇచ్చినట్లు కాదు. ఎందుకంటే గత ఏడాది వార్షిక పంట రుణ ప్రణాళిక రూ.56,019 కోట్లతో పోల్చితే కౌలురైతులకు ఇచ్చింది నామమాత్రమే. కౌలు రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. అపరాధ వడ్డీ కలిపితే వడ్డీ భారం తడిసి మోపెడు అవుతోంది. రుణమాఫీ అమలులో క్షేత్ర స్థాయిలో బ్యాంకర్లు కూడా కౌలురైతులకు అన్యాయం చేశారు. జీవోలకు విరుద్దంగా వ్యవసాయం చేయని 'భూ' యాజమానుల వివరాలనే అప్‌లోడ్‌ చేశారు. ఉదాహరణకు ఏలూరు మండలం కోటేశ్వర దుర్గాపురం గ్రామ కౌలురైతులు 70 మందికి ఏడు రైతుమిత్ర గ్రూపుల ద్వారా చాటపర్రు కెనరా బ్యాంకులో రుణం పొందితే వీరి వివరాలకు అప్‌లోడ్‌ చేయలేదు. అలాగే పెదపాడు మండలం వసంతవాడ ఆంధ్రాబ్యాంకులో 20 రైతుమిత్ర గ్రూపుల ద్వారా 200 మంది కౌలు రైతులు రుణాలు పొందారు. వీరి వివరాలను కూడా అప్‌లోడ్‌ చేయకపోడంతో ఒకరికి రుణమాఫీ వర్తిచలేదు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం తలతాకట్టు పెట్టయినా కౌలురైతులు, రైతుమిత్ర, జె.ఎల్‌. గ్రూపులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలి. ఈ రుణమాఫీ జరగకపోతే బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
నత్తనడకన ఎల్‌ఇసిలు
కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో నీరుగార్చు తోంది. గత సంవత్సరం 3.39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ఈ సంవత్సరం నత్తనడక సాగుతోంది. భూ అధీకృత సాగు దారు చట్టంలో లేని నిబంధనలు పెట్టి కౌలుదారులను వెనక్కి నెడుతున్నారు. ఇతర ప్రభుత్వం పథకాలపై హోర్డింగ్స్‌, పోస్టర్లు, మైక్‌లతో హోరెత్తిస్తారు. కానీ కౌలురైతుల గుర్తింపు కార్డుల ప్రక్రియపై కనీస ప్రచారం కూడా చేయరు. గ్రామంలో కౌలురైతుల పేర్లు జాబితాలు తయారు చేసి వాటి ఆధారంగా రుణగుర్తింపు కార్డులు జారీ చేయాలి. అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదేశాలు ఇవ్వాలి.
ఈసారైనా రుణం అందేనా
2015-16 ఆర్థిక సంవత్సరంలో 48,067 కోట్లు పంట రుణాలుగా రాష్ట్ర రుణ ప్రణాళికలో లక్ష్యాన్ని నిర్దేశిం చారు. ఈ రుణాలు వాస్తవ సాగుదారులకు చేరడంలేదు. 133.97 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయాలని లక్ష్యం ప్రకటించారు. 2014-15లో 111.07 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో 80 శాతం భూమిని సాగుచేస్తూ ఆహార పంటలు పండిస్తున్నది కౌలు రైతులు, పేదరైతులే. కానీ వారికి ఇస్తున్న పంట రుణాలు అరకొర మాత్రమే. కార్పొరేట్‌ సంస్థలకు, బడా పారి శ్రామిక వేత్తలకు, వ్యవసాయం చేయని భూ యజమానులకు వేల కోట్లు అప్పులు ఇస్తున్న బ్యాంకులు నిజమైన అన్నదాతలకు మొండి చెయ్యిచూపుతున్నాయి. రిజర్వు బ్యాంకు, నాబార్డు మార్గదర్శకాలు, భూ అధీకృత సాగు దారు చట్టంఉన్నా బ్యాంకర్లు చట్టాలను చట్టుబండ లుగా మార్చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రవేటు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రుణ ప్రణాళికలో కౌలురైతులకు ప్రత్యే కంగా రు.10 వేల కోట్లతో ప్రత్యేక రుణప్యాకేజీని ప్రకటించి అమలు చేస్తేనే రుణ భారం నుంచి కొద్దిపాటి ఉపశమనం కలుగుతుంది. పంటరుణాలు నిజమైన సాగుదారులకే ఇవ్వాలి. రిజర్వుబ్యాంకు ఆదేశాల ప్రకారం ఎటువంటి హామీలేకుండా సాగుదారులకు రూ.లక్ష వరకు సొంత ధృవపత్రం ఆధారంగా రుణాలు ఇవ్వాలి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను అమలు చేయాలి. వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలి.
పెరిగిన కౌలు భారం
కౌలు రైతుకు వ్యవసాయ పెట్టుబడిలో కౌలు పెట్టుబడే అధికం. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్‌లో ధరలేక నష్టపోతున్నా, దివాళా తీస్తున్నా కౌలురేట్లు తగ్గడం లేదు. పైగా కౌలు రేట్లు మరింత పెంచేస్తు న్నారు. వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, కూరగాయాలు, తదితర పంటల్లో కౌలు ఎక్కువగా పెంచేవారు. కౌలురేట్లు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. కౌలు చెల్లించాలని 'భూ' యాజమానులు పెట్టే అవమా నాలు, ఒత్తిడి భరించలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. పెరుగుతున్న కౌలు రేట్లు తగ్గించాలి. కౌలు భారం తగ్గకపోతే కౌలు రైతులు కాడి కింద పడేస్తే అది 'భూ' యజమానులకు నష్టం అని గమనించాలి.
ఇన్‌పుట్స్‌ దరి చేరవు
2015-16 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో రూ.162 కోట్లు యాంత్రీకరణకు కేటాయించారు. ఎరు వులు, విత్తనాలు, పురుగు మందులకు ప్రైవేటు వ్యాపారు లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇన్‌పుట్స్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలించి వ్యాపారులు అధిక రేట్లకు అమ్ముతున్నా అధికా రులుగానీ, ప్రభుత్వంగానీ పట్టించు కోదు. 70 శాతం సాగు భారాన్ని మోస్తున్న కౌలు రైతు లకు వ్యవసాయ సబ్సిడీలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఖరీఫ్‌లో కౌలు రైతుల 'సాగు' సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వ స్పందించేలా పెద్ద ఎత్తున ఆందోళనలకు కౌలు రైతులు సమాయత్తం కావాలి.
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు)
- కె.శ్రీనివాస్‌